English | Telugu
ఆ సినిమా నుంచి నన్ను తప్పించినందుకు నిర్మాతలు సారీ చెప్పారు!
Updated : Jun 29, 2021
ఒక సినిమాకు తాను డేట్స్ కేటాయించగా, చివరి నిమిషంలో నిర్మాతలు తనను ఆ సినిమా నుంచి తప్పించారనీ, ఆ తర్వాత వారు తనకు క్షమాపణలు చెప్పారనీ నటి తాప్సీ పన్ను వెల్లడించింది. ఆ సినిమా పేరును ఆమె బయటపెట్టకపోయినా, అమర్యాదకరంగా తనను తప్పించి వేరే నటిని తీసుకున్నందుకు నిర్మాతలను తాప్సీ తిట్టిపోసిందని ఇదివరకు ప్రచారంలోకి వచ్చింది.
ఒక తాజా ఇంటర్వ్యూలో, మీడియా ద్వారానే ఆ సినిమాలో తాను భాగం కాదనే విషయం తెలిసిందని ఆమె చెప్పింది. తర్వాత ఆ చిత్ర నిర్మాతలు తనను కలిసి క్షమాపణలు తెలిపారనీ, కానీ తనను తప్పించడానికి అసలు కారణాలను వెల్లడించడానికి వెనుకాడారనీ తాప్సీ తెలిపింది.
ఆ సినిమాకు తనను తీసుకొన్న తర్వాత తొలగించడంపై మాట్లాడుతూ, "ఇది నాకు జరిగింది. నేనింకా షూటింగ్‌కు రెడీ కాలేదు. కేవలం నా డేట్స్ ఇచ్చాను. తర్వాత నన్ను బయటకు విసిరేశారు. అయితే ఈ విషయాన్ని వాళ్లు నాకు చెప్పలేదు. మీడియా ద్వారానే ఆ విషయం నాకు తెలిసింది." అని వెల్లడించింది తాప్సీ.
'పతి పత్ని ఔర్ వో' మూవీ కోసం తాను కాల్షీట్లు కేటాయించినట్లు 2019 ప్రారంభంలో తాప్సీ తెలిపింది. ఆ తర్వాత దర్శకుడు ముదస్సర్ అజీజ్‌తో మరొకరిని తీసుకొమ్మని నిర్మాతలు చెప్పారు. ఆ సినిమాలో కార్తీక్ ఆర్యన్, అనన్యా పాండే, భూమి పెడ్నేకర్ నటించారు. టి-సిరీస్ దాన్ని నిర్మించింది.