English | Telugu

'రాక్ష‌సుడు' హిందీ రీమేక్‌లో అక్ష‌య్ కుమార్‌! హీరోయిన్‌గా ర‌కుల్‌!!

'రాక్ష‌సుడు' హిందీ రీమేక్‌లో అక్ష‌య్ కుమార్‌! హీరోయిన్‌గా ర‌కుల్‌!!

 

బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ అక్ష‌య్ కుమార్‌కు త‌మిళ సినిమాలు బాగా న‌చ్చుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల లారెన్స్ 'కాంచ‌న' మూవీ హిందీ రీమేక్ 'ల‌క్ష్మీ'లో న‌టించిన ఆయ‌న, ప్ర‌స్తుతం 'జిగ‌ర్తాండ' (తెలుగులో 'గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌') రీమేక్ 'బ‌చ్చ‌న్ పాండే' చేస్తున్నాడు. లేటెస్ట్‌గా మ‌రో త‌మిళ సినిమా హిందీ రీమేక్‌కు ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అది.. విష్ణు విశాల్ హీరోగా న‌టించిన హిట్ ఫిల్మ్ 'రాచ్చ‌స‌న్‌'. తెలుగులో ఆ సినిమా బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా 'రాక్ష‌సుడు' పేరుతో రీమేక్ అయ్యి, మంచి హిట్ట‌యింది.

లేటెస్ట్ రిపోర్టుల ప్ర‌కారం 'బెల్ బాట‌మ్' మూవీ త‌ర్వాత మ‌రోసారి రంజిత్ తివారీ డైరెక్ష‌న్‌లో అక్ష‌య్ కుమార్ న‌టించ‌బోతున్నాడు. ఆగ‌స్టులో ఈ సినిమా లండ‌న్‌లో స్టార్ట్ కానున్న‌ది. ఇది 'రాచ్చ‌స‌న్' రీమేక్ అని తెలిసింది. పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా అక్ష‌య్ న‌టించే ఈ మూవీకి 'మిష‌న్ సిండెరెల్లా' అనే టైటిల్ పెట్టారు. లండ‌న్‌తో పాటు, యూకేలోని మ‌రికొన్ని లొకేష‌న్ల‌లో ఈ సినిమాని చిత్రీక‌రించ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

చిన్న‌పిల్ల‌ల‌ను నిర్దాక్షిణ్యంగా హ‌త్య‌చేసే ఓ రాక్ష‌సుడిని అక్ష‌య్ ఎలా ప‌ట్టుకున్నాడ‌నేది ఇందులోని ప్ర‌ధానాంశం. ఈ మూవీని జాకీ, వ‌షు భ‌గ్నాని సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రి ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మొద‌లుపెట్టారు. ఇందులో హీరోయిన్‌గా ర‌కుల్‌ప్రీత్ సింగ్ ఎంపికైంది. తెలుగులో ఆ పాత్ర‌ను అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పోషించింది. అక్ష‌య్‌, ర‌కుల్ క‌లిసి న‌టించ‌డం ఇదే తొలిసారి.