English | Telugu

రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డిన పాపుల‌ర్ న‌టి!

మ‌రాఠీ న‌టి హీనా పంచ‌ల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌లోని ఇగ‌త్‌పురిలో ఓ రేవ్ పార్టీ జ‌రుగుతోంద‌ని స‌మాచారం అందుకున్న నాసిక్ పోలీసులు ఆ పార్టీపై దాడి చేశారు. ఆ పార్టీలో పాల్గొన్న‌ బిగ్ బాస్ మ‌రాఠీ కంటెస్టెంట్ హీనాతో పాటు మ‌రికొంత‌మందిని ఆదివారం అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. హీనాతో పాటు అరెస్ట్ చేసిన వాళ్లంద‌రి ర‌క్త న‌మూనాల‌ను ప‌రీక్ష‌ల‌కు పంపామ‌నీ, వాటి రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామ‌నీ వారు వెల్ల‌డించారు. రేవ్ పార్టీలో పేరుపొందిన న‌టులెవ‌రూ లేర‌నీ, అరెస్ట్ అయిన‌వాళ్లంతా చిన్న ఆర్టిస్టులేన‌నీ పోలీసులు తెలిపారు.

వాస్త‌వానికి బాలీవుడ్‌కు చెందిన కొంత‌మంది హై-ప్రొఫైల్ సెల‌బ్రిటీలు శ‌నివారం రాత్రి ఇగ‌త్‌పురి హిల్ స్టేష‌న్‌లోని ఓ ప్రైవేట్ బిల్డింగ్‌లో పార్టీ చేసుకుంటున్నార‌నే కాన్ఫిడెన్షియ‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ నాసిక్ పోలీసుల‌కు అందింది. వెంట‌నే రైడ్ చేసిన వారు, ఆ పార్టీలో ఉన్న‌వారినంద‌రినీ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 22 మందిని అదుపులోకి తీసుకుంటే, వారిలో 12 మంది మ‌హిళ‌లు ఉన్నారు. అంతేకాదు, ఆ ప్ర‌దేశం నుంచి ప‌లు రకాల డ్ర‌గ్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథ‌మిక విచార‌ణ అనంత‌రం 12 మంది మ‌హిళ‌ల్లో ఐదారుగురు బాలీవుడ్‌తో పాటు, ద‌క్షిణాది సినిమాల్లో న‌టించే తార‌లుగా గుర్తించారు. వారిలో హీనా పంచ‌ల్ ఒక్క‌రు మాత్రం మ‌రాఠీ, హిందీ సినిమాల్లో పాపుల‌ర్ యాక్ట్రెస్‌. 'లైఫ్ మే ట్విస్ట్ హై', 'బాబూజీ ఏక్ టికెట్ బొంబాయ్' లాంటి సినిమాల్లో ఆమె న‌టించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ మ‌రాఠీ సీజ‌న్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొంది.