Read more!

English | Telugu

'సూర్య‌వంశీ'కి బంప‌ర్ ఓపెనింగ్స్‌.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ రూ. 25 కోట్ల పైమాటే!

 

అక్ష‌య్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన 'సూర్య‌వంశీ' మూవీ శుక్ర‌వారం (న‌వంబ‌ర్ 5) ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐదు వేల‌కు పైగా థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఏడాదిన్న‌ర‌గా స‌రిగా థియేట‌ర్లు ఓపెన్ కాక‌పోవ‌డంతో బాలీవుడ్ సంక్షోభంలో ప‌డింది. ఇప్పుడు కొవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత తొలిసారిగా మ‌హారాష్ట్ర‌లో థియేట‌ర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనైనా థియేట‌ర్లు తెరుచుకోవ‌డంతో 'సూర్య‌వంశీ' ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి రోజు ఈ సినిమా రూ. 25 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించ‌డంతో బాలీవుడ్‌కు కొత్త ఊపిరినిచ్చిన‌ట్ల‌యింది. ప్రేక్ష‌కులు కూడా 'సూర్య‌వంశీ'ని చూడాల‌నే ఆత్రుత‌తో థియేట‌ర్ల‌కు త‌ర‌లిరావ‌డం నిర్మాత‌ల‌ను, డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది.

ప‌రుగులెత్తే క‌థ‌నంతో 'సూర్య‌వంశీ'ని రోహిత్ శెట్టి రూపొందించిన విధానం ఆడియెన్స్‌ను అల‌రిస్తోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. యాక్ష‌న్‌, రొమాన్స్‌, హ్యూమ‌ర్‌, డ్రామా, థ్రిల్స్‌.. లాంటి ఎలిమెంట్స్ అన్నింటినీ మేళ‌వించిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో చూడ‌ద‌గ్గ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ అనే టాక్ వ‌చ్చింది. అక్ష‌య్ కుమార్ ప‌ర్ఫార్మెన్స్‌, క్లైమాక్స్ ఈ సినిమాకు ఆయువుప‌ట్టుగా నిలిచాయి. 'సూర్య‌వంశీ'కి వ‌చ్చిన రెస్పాన్స్‌తో బాలీవుడ్‌లో దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్ కంటిన్యూ అవుతున్నాయి.

మ‌హారాష్ట్ర‌లో థియేట‌ర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ అవుతున్న‌ప్ప‌టికీ ఫ‌స్ట్ డే మూవీ క‌లెక్ష‌న్ల‌లో 35 నుంచి 40 శాతం షేర్ అక్క‌డ్నుంచే రావ‌డం విశేషం. 'సూర్య‌వంశీ' ఓపెనింగ్స్‌ను అసాధార‌ణం అని ట్రేడ్ విశ్లేష‌కులు త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌, కోమ‌ల్ న‌హ‌తా అభివ‌ర్ణించారు. మ‌హారాష్ట్ర‌తో పాటు గోవా, బిహార్‌, జార్ఖండ్‌, హ‌ర్యానాల‌లోనూ థియేట‌ర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే న‌డుస్తున్నాయి. ఫుల్ ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుస్తున్న‌ట్ల‌యితే ఫ‌స్ట్ డే 'సూర్య‌వంశీ' రూ. 40 కోట్ల‌ను క్రాస్ చేసేద‌ని అంటున్నారు.

క‌త్రినా కైఫ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, ర‌ణ‌వీర్ సింగ్ స్పెష‌ల్ రోల్స్‌లో అల‌రించారు. జాకీ ష్రాఫ్‌, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, అభిమ‌న్యు సింగ్‌, సికింద‌ర్ ఖేర్‌, నికితిన్ ధీర్‌, జావెద్ జాఫ్రీ ఇత‌ర కీల‌క పాత్ర‌లు చేశారు.