Read more!

English | Telugu

సంజ‌య్ కుమార్ సింగ్ చేతికి ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్ కేసు!

 

షారుక్ ఖాన్ కొడుకు ఆర్య‌న్ ఖాన్ ఇరుక్కున్న డ్ర‌గ్ కేసును ముంబై జోనల్ డైరెక్ట‌ర్‌ స‌మీర్ వాంఖ‌డే చేతుల్లోంచి త‌ప్పించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), దాన్ని ఐపీఎస్ ఆఫీస‌ర్ సంజ‌య్ కుమార్ సింగ్ నేతృత్వంలోని స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ (సిట్‌)కు అప్ప‌గించింది. ఆర్య‌న్ ఖాన్ కేసులో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని స‌మీర్ వాంఖ‌డే, మ‌రికొంద‌రు అధికారుల‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది ఎన్సీబీ. వాంఖ‌డేపై ఇప్ప‌టికే శాఖాప‌ర‌మైన విచార‌ణ‌ను అది చేప‌ట్టింది.

స‌మీర్ వాంఖ‌డే నేతృత్వంలోని టీమ్ అక్టోబ‌ర్ 3న ఆర్య‌న్ ఖాన్‌ను క్రూయిజ్ షిప్ డ్ర‌గ్ కేసులో అరెస్ట్ చేసింది. ఇప్పుడా కేసును ఎన్సీబీలో డిప్యుటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ర్యాంక్ ఆఫీస‌ర్ అయిన సంజ‌య్ కుమార్ సింగ్ విచారించ‌నున్నారు. ఆయ‌న 1996 బ్యాచ్‌కు చెందిన ఒడిశా ఐపీఎస్ క్యాడ‌ర్ ఆఫీస‌ర్‌. ఒడిశా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వివిధ హోదాల్లో ప‌నిచేసిన ఆయ‌న సీబీఐలోనూ ప‌నిచేశారు.

ఎన్సీబీలో జాయిన్ కాక‌మునుపు, ఒడిశా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా డ్ర‌గ్ టాస్క్ ఫోర్స్‌కు నేతృత్వం వ‌హించారు సంజ‌య్ సింగ్‌. డిఐజీ హోదాలో 2008 నుంచి 2015 వ‌ర‌కు ఆయ‌న సీబీఐలో విధులు నిర్వ‌ర్తించారు. ఆ టైమ్‌లో ఆయ‌న ప‌లు హై-ప్రొఫైల్ కేసుల‌ను హ్యాండిల్ చేశారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో సంజ‌య్ సింగ్‌ ఎన్సీబీలో డిప్యుటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆర్య‌న్ ఖాన్ కేసును ఆయ‌న హ్యాండిల్ చేస్తారో చూడాల్సి ఉంది.