English | Telugu
అక్షయ్‌ను కొడితే రూ.10 లక్షలు.. హిందూ సంఘం ఆఫర్
Updated : Aug 13, 2023
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'ఓ మై గాడ్ 2'. ఇందులో ఆయన పరమ శివుడు పాత్రలో నటించారు. ఆయన భక్తుడి పాత్రలో పంకజ్ త్రిపాఠి నటించారు. విడుదలకు ముందు సెన్సార్ సభ్యులైతే ఈ సినిమాకు ఏకంగా 16 కట్స్ ఇచ్చారు. సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు సినిమా రిలీజైంది. రిలీజ్ తర్వాత కూడా సినిమా చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. హిందూ సంఘాలు 'ఓ మై గాడ్ 2'ను నిలిపి వేయాలని కోరుతున్నాయి. సినిమా హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందంటూ వారు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రీయ హిందూ పరిషత్ సంఘం అక్షయ్ కుమార్ దిష్టి బొమ్మను తగలబెట్టింది.
ఇదంతా ఒక వైపుంటే.. ఆగ్రాకు చెందిన ఓ హిందూ సంఘం అయితే అక్షయ్ కుమార్‌ను చెంప దెబ్బ కొట్టిన వారికి ఏకంగా రూ.10 లక్షలు నగదు బహుమతిని ఇస్తామని పేర్కొంది. అసలు సినిమాపై ఇంత మేరకు అభ్యంతరాలు రావటానికి కారణం.. పిల్లలకు లైంగిక విద్య ఆవశ్యకత అవసరం అనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కటమే. సినిమా కథ విషయానికి వస్తే శివ భక్తుడైన పంకజ్ త్రిపాఠి కొడుకు ఓ తప్పు చేస్తాడు. లైంగిక విద్యపై అవగాహన లేదని, స్కూల్‌లో సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల తప్పు జరిగిందని చెబుతూ కేసు వేస్తాడు.
దాంతో కొందరు పంకజ్ త్రిపాఠి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టటానికి ప్రయత్నిస్తారు. దీంతో తన భక్తుడిని కాపాడుకోవటానికి శివుడు అక్షయ్ కుమార్ రూపంలో భూమి మీదకు వస్తాడు. తర్వాత ఏం జరిగింది.. పంకజ్ త్రిపాఠి పెట్టిన కేసు ఏమైంది.. అనేదే అసలు కథ.
