English | Telugu

ల్యాండ్ డీల్‌లో రూ. 1.6 కోట్ల‌కు మోస‌పోయిన శిల్పాశెట్టి త‌ల్లి!

శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంప‌తుల విష‌యంలో కాంట్ర‌వ‌ర్సీలు, క‌ష్టాలు ఎలాంటి ద‌య‌నూ చూపించ‌డం లేద‌నిపిస్తోంది. అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో రాజ్ కుంద్రా అరెస్ట‌యి జైలు ఊచ‌ల్ని లెక్క‌పెడుతుండ‌గా, శిల్పాశెట్టి త‌ల్లి సునందా శెట్టి ఒక ల్యాండ్ డీల్ విష‌యంలో రూ. 1.6 కోట్ల మేర‌కు మోస‌పోయిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది.

సుధాక‌ర్ ఘ‌రే అనే వ్య‌క్తి నుంచి సునందా శెట్టి రూ. 1.6 కోట్లు వెచ్చించి ఒక స్థ‌లం కొనుగోలు చేశారు. అయితే ఆ స్థ‌లానికి సంబంధించి తాను పొందిన డాక్యుమెంట్లు నకిలీవ‌ని తేల‌డంతో త‌ను మోస‌పోయిన‌ట్లు గుర్తించారు. వెంట‌నే ఆమె సుధాక‌ర్‌పై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీలో సంబంధింత సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మిగ‌తా వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

అశ్లీల చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్న కేసులో భ‌ర్త రాజ్ కుంద్రా చిక్కుకోవ‌డంతో ప‌లు ప్రాజెక్టుల‌ను శిల్పా శెట్టి వ‌దులుకుంటోంది. వాటిలో సూప‌ర్ డాన్స‌ర్ 4 కూడా ఉంది. తాను ఒంటరిదాన్న‌యిపోయాన‌నే విచారంలో ఉన్న ఆమె, ఈ వివాదంలో ఇంత‌వ‌ర‌కూ బ‌హిరంగంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంప‌తుల‌పై సోష‌ల్ మీడియాలో ప‌లు మీమ్స్ చ‌లామ‌ణీ అవుతున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో బాలీవుడ్ మొత్తంగా మౌనం వ‌హిస్తుండ‌గా, శిల్పాశెట్టి కుటుంబం ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా క‌ష్టాల‌ను ఎదుర్కొంటోంది.