English | Telugu

న్యూయార్క్ హోట‌ల్ బాల్క‌నీలో ఐశ్వ‌ర్యకు ప్ర‌పోజ్ చేసిన‌ అభిషేక్!

మెరుపుతీగ ఐశ్వ‌ర్యా రాయ్‌, పొడ‌గ‌రి న‌టుడు అభిషేక్ బ‌చ్చ‌న్ 1996లో తొలిసారి క‌లుసుకున్నారు. హిందీలో ఐశ్వ‌ర్య తొలి సినిమా 'ఔర్ ప్యార్ హోగ‌యా' షూటింగ్ స్విట్జ‌ర్లాండ్‌లో జ‌రుగుతున్న‌ప్పుడు ఒక‌రోజు సాయంత్రం అక్క‌డ‌కు అభిషేక్ వ‌చ్చాడు. అత‌ను న‌టిస్తోన్న 'మేజ‌ర్ సాబ్' షూటంగ్ సైతం అప్పుడు స్విట్జ‌ర్లాండ్‌లోనే జ‌రుగుతోంది. మొద‌ట్నుంచీ అభిషేక్ కొంచెం మొహ‌మాట‌స్తుడు. అక్క‌డికి వ‌చ్చినా ఐశ్వ‌ర్య వాళ్లంద‌రికీ దూరంగా వేరే చోట కూర్చున్నాడు. ఐశ్వ‌ర్య కొంచెం చొర‌వ చేసి త‌మ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి కూర్చోమంది.

ఆ త‌ర్వాత‌, 'ఢాయీ అక్ష‌ర్ ప్రేమ్ కే' షూటింగ్ స‌మ‌యంలో ఆ ఇద్ద‌రూ మ‌రోసారి క‌లుసుకున్నారు. అది ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి చిత్రం. ఇక అభిషేక్ త‌న ప్రేమ‌ను తెలిపిన క్ష‌ణాల‌ను జీవితంలో ఐశ్వ‌ర్య ఎప్ప‌టికీ మ‌ర్చిపోదు. ఆ రోజు జ‌రిగిన ప్ర‌తి చిన్న విష‌య‌మూ ఆమెకు బాగా గుర్తుంది. ప్ర‌తిక్ష‌ణం మ‌ధురంగా ఆమె మ‌న‌సులో నిండిపోయింది. వాళ్లిద్ద‌రూ 'గురు' మూవీ స్క్రీనింగ్ కోసం న్యూయార్క్ వెళ్లారు. త‌ర్వాత తాము బ‌స చేసిన హోట‌ల్‌కు తిరిగొచ్చారు. ఐశ్వ‌ర్య డ్ర‌స్ చేంజ్ చేసుకొని షూస్ జిప్ వేసుకుంటుండ‌గా ఆమెను అభిషేక్ బాల్క‌నీలోకి పిలిచాడు.

ఐశ్వ‌ర్య మామూలుగా వెళ్లింది. వెళ్ల‌గానే, సినిమాల్లో మాదిరిగా మోకాలి మీద కూర్చొని ఆమె చేతి వేలికి ఉంగ‌రం తొడుగుతూ డ్ర‌మ‌టిక్‌గా కాకుండా, చాలా సింపుల్‌గా త‌న ప్రేమ‌ను తెలియ‌జేశాడు. ఒక్క క్ష‌ణం కాలం ఆగిపోయిన‌ట్లు అనిపించింది ఐశ్వ‌ర్య‌కు. వెంట‌నే అత‌డి ప్రేమ‌ను అంగీక‌రించేసింది. ఒక‌వేళ అభిషేక్ త‌న ప్రేమ‌ను అప్పుడు వ్య‌క్తం చేయ‌క‌పోతే, త‌నే ఆ ప‌ని చేసి ఉండేదాన్న‌ని త‌ర్వాత ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది ఐశ్వ‌ర్య‌.

త‌మ విష‌యం పెద్ద‌వాళ్ల‌కు చెప్ప‌డం, రెండు కుటుంబాల పెద్ద‌లూ ఒప్పుకోవ‌డం, పెళ్లి.. అంతా ఏడాదిలోపే జ‌రిగిపోయింది. 2007 ఏప్రిల్ 20న‌ వారి పెళ్ల‌వ‌గా, నాలుగున్న‌రేళ్ల త‌ర్వాత 2011 న‌వంబ‌ర్ 16న ఆరాధ్య‌కు జ‌న్మ‌నిచ్చింది ఐశ్వ‌ర్య‌. ఇప్ప‌టికీ త‌మ ప్రేమ‌, పెళ్లి.. అంతా ఒక క‌ల‌లా అనిపిస్తుంటుంది ఐశ్వ‌ర్య‌కు.