English | Telugu

'హాట్‌షాట్స్' యాప్‌లో భ‌ర్త పాత్ర‌పై నోరు విప్పిన శిల్పాశెట్టి!

శిల్పాశెట్టి భ‌ర్త‌, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రా, అత‌ని ఐటీ హెడ్ ర్యాన్ థోర్పేల‌ను జూలై 27 వ‌ర‌కు పోలీస్ క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ శుక్ర‌వారం ముంబైలోని ఒక మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలిచ్చింది. అదే రోజు జుహూలోని కుంద్రా ఇంటిలో హైడ్రామా చోటు చేసుకుంది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ ఇంట్లో న‌టి శిల్పాశెట్టిని ప్ర‌శ్నించారు. అశ్లీల చిత్రాల నిర్మాణంలో కుంద్రా పాత్ర గురించి ఆమెకేమైనా తెలుసా.. అని ఆరా తీశారు. ఆమెను ప్ర‌శ్నించిన విష‌యంపై క్రైమ్ బ్రాంచ్ ఇంత‌దాకా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌క‌పోయినా, పోర్నోగ్ర‌ఫీ ద్వారా సంపాదించిన డ‌బ్బును కుంద్రా ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వినియోగించిన‌ట్లు పోలీసులు భావిస్తున్నాట్లు తెలిసింది.

ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ ప్ర‌కారం, త‌న భ‌ర్త రాజ్ కుంద్రా అమాయ‌కుడ‌ని క్రైమ్ బ్రాంచ్‌కు ఇచ్చిన‌ స్టేట్‌మెంట్‌లో చెప్పింది. 'హాట్‌షాట్స్' యాప్‌లోని కంటెంట్ గురించిన ప్ర‌శ్న‌కు, దాని గురించి త‌న‌కేమీ తెలీద‌నీ, త‌న భ‌ర్త‌కు అశ్లీల చిత్రాల‌తో ఎలాంటి సంబంధం లేద‌నీ శిల్పాశెట్టి చెప్పిన‌ట్లు స‌మాచారం. పోర్న్‌కూ, ఎరోటికాకూ తేడా ఉంద‌నీ, పోర్న్ కంటెంట్ నిర్మాణంలో త‌న భ‌ర్త పాత్ర లేద‌నీ ఆమె చెప్పిన‌ట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

మ‌రో ట్వీట్‌లో "హాట్‌షాట్స్ యాప్‌ను రాజ్ కుంద్రా బావ‌, లండ‌న్‌కు చెందిన ప్ర‌దీప్ బ‌క్షి న‌డుపుతున్నాడ‌ని శిల్పాశెట్టి చెప్పింది. త‌న భ‌ర్త అమాయ‌కుడ‌ని తెలిపింది." అని రాసుకొచ్చారు.

కాగా పోలీస్ రిమాండ్‌తో పాటు త‌న‌పై పెట్టిన కేసుల‌ను స‌వాలు చేస్తూ కుంద్రా బాంబే హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. అశ్లీల చిత్రాలను నిర్మించి, వాటిని మొబైల్ యాప్స్ ద్వారా స‌ర్క్యులేట్ చేస్తున్నార‌నే అభియోగంతో ఇప్ప‌టివ‌ర‌కూ కుంద్రా స‌హా ప‌దిమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ముంబై పోలీసుల‌కు చెందిన క్రైమ్ బ్రాంచ్‌లో ఈ కేసును రిజిస్ట‌ర్ చేశారు.