English | Telugu

భ‌ర్త అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టిని ప్ర‌శ్నించిన క్రైమ్ బ్రాంచ్‌!

అశ్లీల చిత్రాలను రూపొందించి, కొన్ని మొబైల్ అప్లికేషన్ల ద్వారా వాటిని ప‌బ్లిష్ చేశార‌నే అభియోగంపై రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ముంబయి కోర్టు శుక్రవారం నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, అత‌ని భాగ‌స్వామి ర్యాన్ తోర్పేలను జూలై 27 వరకు పోలీసు కస్టడీకి పంపింది.

ఇప్పుడు, ముంబై క్రైమ్ బ్రాంచ్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం రాజ్ కుంద్రాకు చెందిన అశ్లీల చిత్రాల‌ కేసులో శిల్పా శెట్టి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నారు. శిల్పా శెట్టి 2020 డిసెంబర్‌లో వ‌యాన్‌ ఇండస్ట్రీస్ నుండి ఎందుకు తప్పుకున్నారో క్రైమ్ బ్రాంచ్ వివ‌రాలు రాబ‌డుతోంది.

ముంబయి పోలీసులు శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, అతని భాగ‌స్వామి ర్యాన్ తోర్పేను మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి, మ‌రో వారం రోజుల పాటు వారిని త‌మ క‌స్ట‌డీకి అప్ప‌గించాల్సిందిగా కోరారు. అశ్లీల చిత్రాల‌ ద్వారా సంపాదించిన డబ్బును వారు ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగించార‌ని తాము అనుమానిస్తున్నట్లు ముంబై పోలీసులు కోర్టుకు తెలిపారు.

19 అడ‌ల్ట్ ఫిలిమ్స్‌కు సంబంధించి ఒక డీల‌ర్‌తో రాజ్ కుంద్రా చేసుకున్న ఒప్పందంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అశ్లీల కంటెంట్ ద్వారా వ‌చ్చిన డ‌బ్బును ఆన్‌లైన్ బెట్టింగ్‌లో ఉపయోగించినట్లు తాము విశ్వసిస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ అధికారులు కోర్టుకు తెలియజేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న‌ కుంద్రా ల్యాప్‌టాప్‌లో 48 టిబి డేటా, 51 అశ్లీల చిత్రాలు దొరికాయి.

వయాన్ ఇండస్ట్రీస్ అకౌంటెంట్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు నమోదు చేశారు. ప్రతి నెలా 4,000 నుండి 10,000 పౌండ్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు అత‌ను తెలిపాడు. రాజ్ కుంద్రాకు వోచర్లు, బిల్లులు ఇచ్చారు. ఇప్ప‌టికే, ఐటి డెవలపర్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. కుంద్రా అరెస్టు అయిన ఒక రోజు తరువాత, అకౌంటెంట్ కొంత డేటాను తొలగించాడని క‌నిపెట్టారు. ఇప్పుడు దాన్ని రికవరీ చేయ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.