English | Telugu

24 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ న‌టిస్తానంటున్న‌ మాజీ క్రికెట‌ర్ మ‌నోజ్ ప్ర‌భాక‌ర్ భార్య‌!

శ్రీ‌కాంత్ హీరోగా ఇ.వి.వి. స‌త్య‌నారాయ‌ణ డైరెక్ట్ చేసిన 'తాళి' (1997) మూవీలో హీరోయిన్‌గా న‌టించారు ఫ‌రీన్‌. కానీ ఆ సినిమాలో ఆమె స్క్రీన్ నేమ్‌ను శ్వేత‌గా మార్చారు. అయితే ఆ సినిమా త‌ర్వాత ఆమె మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌లేదు. 24 సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ న‌టించేందుకు రెడీ అంటున్నారు. "ఇప్పుడు నా పిల్ల‌లు ఎదిగారు. ముంబైలో ఉంటున్నందువ‌ల్ల ఫిలిమ్స్‌లో న‌టించ‌డం కొన‌సాగించాల‌ని అనుకుంటున్నాను. సినిమాల్లో న‌టించేందుకు ట్రావెల్ చేయ‌డానికీ రెడీగా ఉన్నాను." అని ఆమె చెప్పారు.

తాను త్వ‌ర‌గా లైఫ్‌లో సెటిల్ అవ్వాల‌ని అనుకోలేద‌నీ, కానీ అదలా జ‌రిగిపోయింద‌నీ ఆమె అన్నారు. త‌న‌కు ఫ్యామిలీ, త‌న పిల్ల‌లు చాలా ముఖ్య‌మ‌నీ అందుక‌నే ఇంత‌కాలం న‌ట‌న‌కు దూరంగా ఉన్నాన‌నీ ఫ‌రీన్ తెలిపారు. "ఈ విష‌య‌మై నా భ‌ర్త మ‌నోజ్‌తో మాట్లాడాను. ఇప్పుడు నువ్వు తీరిక‌గా ఉన్నావు కాబ‌ట్టి, నువ్వు చెయ్యాల‌నుకుంది చెయ్యి అని ఆయ‌న అన్నారు. అందుకే ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి తిరిగి వ‌ద్దామ‌నుకుంటున్నాను." అని ఆమె చెప్పారు. మ‌నోజ్ ప్ర‌భాక‌ర్‌తో పెళ్లి త‌ర్వాత ఆమె ఢిల్లీకి వెళ్లిపోయారు.

నిజానికి షారుక్ ఖాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిల్మ్‌ 'బాజీగ‌ర్‌'లో శిల్పాశెట్టి చేసిన రోల్‌ను ఆమె చెయ్యాల్సింది. "ఆ సినిమాలో శిల్ప చేసిన రోల్‌ను నాకు ఆఫ‌ర్ చేశారు. కానీ అప్పుడు క‌మ‌ల్ హాస‌న్‌తో చేసే చాన్స్ వ‌చ్చింది. ఆయ‌న‌తో సినిమా చెయ్య‌డం కోసం ఆ రోజుల్లో అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూసేవాళ్లు. అది శివాజీ గ‌ణేశ‌న్‌గారి బ్యాన‌ర్ సినిమా. అందుకే దానికోసం బాజీగ‌ర్‌ను వ‌దులుకున్నాను." అని వెల్ల‌డించారు ఫ‌రీన్‌. క‌మ‌ల్‌తో ఆమె హీరోయిన్‌గా న‌టించిన ఆ సినిమా 'కాలైజ్ఞాన్' (1993).

ఫ‌రీన్‌, మ‌నోజ్ ప్ర‌భాక‌ర్ దంప‌తుల‌కు ఇద్ద‌రు కొడుకులు.. రాహిల్‌, మాన‌వంశ్‌. మ‌నోజ్‌కు ఫ‌రీన్ రెండో భార్య‌. మొద‌టి భార్య ద్వారా క‌లిగిన సంతానం రోహ‌న్‌, అత‌ని భార్య సంధ్య కూడా వాళ్ల‌తోనే క‌లిసుంటున్నారు.

హిందీ ఫిల్మ్ 'జాన్ తేరే నామ్' (1992) ద్వారా ఫ‌రీన్‌ హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు. దాదాపు 20 సినిమాల దాకా న‌టించారు.