English | Telugu

త‌న రికార్డ్ తానే.. షారూఖ్‌కే సాధ్యం

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ షారూఖ్ ఖాన్ మ‌రో హీరో ఎవ‌రూ సాధించ‌ని కొత్త రికార్డ్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. రీసెంట్‌గా రిలీజైన ‘జ‌వాన్‌’తోనే ఆ రికార్డును ఆయ‌న సొంతం చేసుకోవ‌టం విశేషం. అస‌లు వివ‌రాల్లోకి వెళితే, కింగ్ ఖాన్ క‌థానాయ‌కుడిగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా ‘జ‌వాన్‌’. ఈ సినిమా రిలీజ్ రోజు నుంచి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ ప‌రంగా దుమ్ము రేపుతూ సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తోంది. ప‌ది రోజుల్లోనే మూవీ రూ.797 కోట్లు వ‌సూళ్ల‌ను సాధించింది. ఇదే ఏడాది బాలీవుడ్ బాద్ షా క‌థానాయ‌కుడిగా న‌టించిన ప‌ఠాన్ చిత్రం ప‌ది రోజుల్లో రూ.729 కోట్ల‌ను రాబ‌ట్టింది. ఆ లెక్క‌లో చూస్తే షారూఖ్ త‌న రికార్డును తానే క్రాస్ చేసుకున్నారు.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 25న విడుద‌లైన ప‌ఠాన్ సినిమా వెయ్యి కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ఇప్పుడు జ‌వాన్ సినిమా కూడా ఆ ఫీట్‌ను సాధించే దిశ‌గా అడుగులు వేస్తుంది. జ‌వాన్ కూడా రూ.1000 కోట్ల మేర‌కు క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తే మాత్రం ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించిన హీరోగా షారూఖ్ మ‌రో రికార్డ్‌ను త‌న ఖాతాలో వేసుకుంటార‌న‌టంలో సందేహం లేదు. మ‌రో వైపు ఆయ‌న హీరోగా రూపొందుతోన్న డంకీ సినిమా కూడా ఇదే ఏడాది డిసెంబ‌ర్ 22న రిలీజ్ కానుంది. మ‌రి ఇదెలాంటి రికార్డుల‌ను సాధిస్తుందో చూడాలి మ‌రి.

‘జ‌వాన్‌’ సినిమా విష‌యానికి వ‌స్తే రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్‌పై షారూఖ్ స‌తీమ‌ణి గౌరీఖాన్ నిర్మించారు. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. అట్లీ దర్శ‌క‌త్వం వ‌హించిన తొలి బాలీవుడ్ మూవీ ఇది. ఇప్పుడు అట్లీతో సినిమా చేయ‌టానికి బాలీవుడ్ మేక‌ర్స్ ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు. ఇందులో షారూఖ్ ద్విపాత్రాభిన‌యం చేశారు. మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించ‌గా.. ప్రియ‌మ‌ణి, సంజ‌య్ ద‌త్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.