English | Telugu

అలా చేసినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు!

సాధారణంగా ఒక భారీ సినిమాలో స్పెషల్‌ రోల్‌ చేస్తే.. దానికి పారితోషికం కూడా భారీగానే డిమాండ్‌ చేస్తారు. అయితే ఈ విషయంలో తనను మినహాయించాలి అంటోంది దీపికా పదుకొనే. షారూఖ్‌ ఖాన్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘జవాన్‌’ వరల్డ్‌వైడ్‌గా ఎంతటి సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే ఒక స్పెషల్‌ క్యారెక్టర్‌ చేసింది. ఆ క్యారెక్టర్‌ చేసినందుకు దీపికకు రెమ్యునరేషన్‌ భారీగానే ముట్టిందనే వార్తలు వచ్చాయి.
దీనిపై స్పందించిన దీపికా.. ‘షారూఖ్‌, నాకు మధ్య ఎంతో గౌరవం, నమ్మకం ఉన్నాయి. చాలా విషయాల్లో మేమిద్దరం అదృష్టవంతులమే. అందుకే మా కెరీర్‌ ఎంతో హ్యాపీగా వెళుతోంది. షారూక్‌కి సంబంధించి ఏ విషయంలోనూ నేను డిమాండ్‌ చేసింది లేదు. అతని సినిమాలో నేను చేసిన క్యారెక్టర్‌ కోసం రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసానన్న వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదు. నేను లెక్కల గురించి ఆలోచించను. ‘జవాన్‌’ మాత్రమే కాదు, అతిథిగా నటించిన ఏ సినిమాకీ నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. తీసుకోను కూడా. ‘జవాన్‌’లాంటి మంచి సినిమాలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇకపై కూడా షారూక్‌ సినిమాలో అతిథి పాత్ర చెయ్యాల్సి వస్తే నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను’ అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.