Read more!

English | Telugu

కొడుకును దారిలో పెట్ట‌డానికి క‌ష్ట‌ప‌డుతున్న షారుక్‌-గౌరీ ఖాన్‌!

 

గ‌డ‌చిన కొన్ని రోజులుగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌, ఆయ‌న ఫ్యామిలీ క్లిష్ట స్థితిని ఎదుర్కొంటూ వ‌స్తోంది. షారుక్ పెద్ద కొడుకు ఒక డ్ర‌గ్ కేసులో చిక్కుకున్నాడు. అత‌డికి బెయిల్ ఇప్పించ‌డానికి కింగ్ ఖాన్‌కు చాలా రోజులు ప‌ట్టింది. ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆర్య‌న్ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. ఎన్సీబీ క‌స్ట‌డీలో కొన్ని రోజులు ఉన్న త‌ర్వాత‌, ఆర్య‌న్‌కు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ విధించారు. దాంతో అత‌డిని ముంబైలోని ఆర్థ‌ర్ రోడ్ జైలుకు త‌ర‌లించారు. బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసే దాకా అత‌నక్క‌డ మూడు వారాలు గ‌డిపాడు. అత‌ను ఇంటికి తిరిగి రావ‌డంతో కొడుకును దారిలో పెట్ట‌డానికీ, అత‌డి లైఫ్‌ను నార్మ‌ల్‌కు తీసుకురావ‌డానికి షారుక్‌, గౌరీ ఖాన్ దంప‌తులు తీవ్రంగా కృషి చేస్తున్నార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

కొడుకు కోసం గౌరీ ఖాన్ ప్ర‌త్యేక డైట్ ప్లాన్ చేస్తున్నార‌నీ, అత‌డి సెక్యూరిటీ కోసం షారుక్ ఒక బాడీగార్డును పెట్టాల‌ని షారుక్ ప్లాన్ చేస్తున్నార‌నీ సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అంతే కాదు, ఆర్య‌న్ కోసం వారు స్ట్రిక్ట్ రూల్స్‌ను పాటిస్తున్నారు. చాలా రోజులుగా ఆర్య‌న్ ఇంటికి దూరంగా ఉన్నందున‌, అత‌ని లైఫ్‌లో డిసిప్లిన్ తీసుకురావాల‌ని కూడా పేరెంట్స్ నిర్ణయించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో పిల్ల‌లు స‌రైన లైఫ్ స్టైల్‌ను అనుస‌రించ‌ట్లేద‌నేది తెలిసిందే. నిద్ర‌కు ఉప‌క్ర‌మించే టైమ్‌, లేచే టైమ్‌, వారు తీసుకొనే ఆహారం ఒక క్ర‌మ‌బ‌ద్ధంగా ఉండ‌టం లేద‌ని నిపుణులు చెబుతూ వ‌స్తున్నారు. మ‌న ఇళ్ల‌ల్లోనూ పిల్ల‌లు అదే త‌ర‌హాలో ఉండ‌టం చూస్తున్నాం. 

అందుక‌ని, ఆర్య‌న్ లైఫ్ స్టైల్‌ను గాడిలో పెట్ట‌డానికి గౌరీ ఖాన్ క‌ష్ట‌ప‌డుతున్నట్లు వారి కుటుంబ స‌న్నిహితులు చెబుతున్నారు. అత‌ని ఆహార‌పు అల‌వాట్లు, ఫిట్‌నెస్‌పై ఆమె దృష్టి పెట్టారు. ఇప్పుడు రోజూ ఆర్య‌న్ పొద్దున్నే లేచి, వ‌ర్క‌వుట్స్ చేస్తున్నాడ‌ని అంటున్నారు. అన్నింటికంటే మించి, కొడుకుతో షారుక్ దంప‌తులు ఎక్కువ స‌మయం గ‌డుపుతూ వ‌స్తున్నారు.