Read more!

English | Telugu

అనుష్క‌, విరాట్‌ల‌ తొమ్మిది నెల‌ల పాప‌కు ఆన్‌లైన్‌లో అత్యాచార బెదిరింపులు!

 

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న‌టి అనుష్క శ‌ర్మ దంప‌తుల తొమ్మిది నెల‌ల పాప‌ వామిక‌పై అత్యాచారం చేస్తామంటూ ఆన్‌లైన్‌లో బెదిరింపులు రావ‌డం అంద‌రినీ షాక్‌కు గురిచేసింది. దీనికి సంబంధించి విచార‌ణ చేప‌ట్టాల్సిందిగా ఢిల్లీ పోలీసుల‌కు ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ మంగ‌ళ‌వారం ఒక‌ నోటీస్ జారీ చేసింది. ఆ ఆన్‌లైన్ బెదిరింపుల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఢిల్లీ పోలీస్ సైబ‌ర్ క్రైమ్ బ్రాంచ్ డిప్యుటీ క‌మిష‌న‌ర్‌ను త‌న‌ నోటీస్‌లో మ‌హిళా క‌మిష‌న్ ఆదేశించింది. 

"ఇటీవ‌ల పాకిస్తాన్‌తో జ‌రిగిన క్రికెట్‌ మ్యాచ్‌లో ఇండియా ఓట‌మి పాలైన ద‌గ్గ‌ర్నుంచీ విరాట్ కోహ్లీ తొమ్మిది నెల‌ల కూతురిని రేప్ చేస్తామంటూ ఆన్‌లైన్ బెదిరింపులు వ‌స్తున్నాయి. త‌న మ‌తం కార‌ణంగా ఆన్‌లైన్ ట్రోల్స్‌కు ల‌క్ష్యంగా మారిన టీమ్‌మేట్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీకి మ‌ద్ద‌తుగా నిలిచిన‌ప్ప‌ట్నుంచీ విరాట్ మీద కూడా ఆన్‌లైన్‌లో ఎటాక్ జ‌రుగుతోంద‌ని తెలియ‌వ‌చ్చింది" అని మ‌హిళా క‌మిష‌న్ త‌న లేఖ‌లో తెలిపింది.

ప్ర‌స్తుతం యుఏఈలో జ‌రుగుతున్న టి20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతుల్లో భారత్ ఓటమి పాలైన తర్వాత భారత క్రికెటర్ మహ్మద్ షమీపై ఆన్‌లైన్‌లో విప‌రీతంగా ట్రోల్స్ వ‌చ్చాయి. దీంతో ష‌మీకి మ‌ద్ద‌తుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆన్‌లైన్ ట్రోల‌ర్స్‌ను 'వెన్నెముక లేని' వారిగా నిందించాడు. 

ఆ త‌ర్వాత ట్రోల‌ర్స్ విరాట్‌ను టార్గెట్‌గా చేసుకుని, వాళ్ల చిన్నారిపై అత్యాచార బెదిరింపుల‌కు దిగారు. ఇవి అనుష్క‌కు తీవ్ర మ‌నోవేద‌న‌ను క‌లిగించాయ‌ని వారికి స‌న్నిహితంగా ఉండే ఒక యాక్ట‌ర్ తెలిపారు. "ఒక సెల‌బ్రిటీగా అనుష్క‌కు ట్రోలింగ్స్‌, నెగ‌టివిటీ కొత్త కాదు. ముఖం చూపించ‌కుండా ట్రోల్స్ చేసే వారిని ప‌ట్టించుకోని స్ట్రాంగ్ వుమ‌న్ ఆమె. కానీ ఈసారి, ఇది చాలా దారుణ‌మైన విష‌యంగా మారింది. సోష‌ల్ మీడియాలో అనుష్క‌, విరాట్ చాలా యాక్టివ్‌గా ఉంటారు. త‌మ కుమార్తె గురించి ఏమంటున్నారో వారికి తెలుసు. ఆ బెదిరింపు కామెంట్ల‌ను చూసి అనుష్క గుండె ప‌గిలిపోయింది. ఇలాంటి వాటికి ఏ త‌ల్లికైనా త‌ట్టుకోలేనంత ఆగ్ర‌హం రావ‌డం స‌హ‌జం. అనుష్క‌కైనా అంతే" అని ఆ యాక్ట‌ర్ చెప్పారు.