English | Telugu
అక్కడ తనలాంటివాళ్లు ఎవరూ లేరంటున్న సారా!
Updated : Mar 5, 2023
సారా అలీఖాన్...ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్ లీగ్‌లో ఉన్న హీరోయిన్లలో ఒకరు. చేస్తున్న పని పట్ల నిబద్ధత, నిన్నటికన్నా ఈ రోజు ఉన్నతంగా ఉండాలనే ఆలోచన, దానికి తగ్గ ఆచరణ, తెలివితేటలు, గ్రేస్ ఉన్న నటిగా పేరుంది సారా అలీఖాన్‌కి. ఎప్పుడూ ఏదో ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకుని, దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంటారు సారా అలీ ఖాన్.
మీడియాతో పెద్దగా మాట్లాడని సారా, ఈ మధ్య ఓ పాడ్‌కాస్ట్ షూట్‌లో తన మనసులోని మాటలు చాలానే చెప్పుకొచ్చారు. ``నా ఆలోచనలు ఎప్పుడూ సుదూరతీరాల్లో ఆగుతుంటాయి. అక్కడ నాలాంటి వారు ఎవరూ ఉండరు. ఒకవేళ ఉంటే, వాళ్లలా ఎదగాలని ఉందని, ఉదాహరణలు చూపించేదాన్నేమో. అక్కడ నిలబడి చూసుకుంటే, నిన్నటి నేను మాత్రమే నా కళ్లకు కనిపిస్తున్నాను. అంటే నాతో నేనే పోటీ పడుతున్నానని అర్థం. కచ్చితంగా నేను కలలుగనే తీరాన్ని చేరుకుంటాను`` అని అన్నారు.
కేవలం కలలు కంటూ కూర్చుంటే అనుకున్నవి సాధించలేం. వాటిని చేరుకోవాలంటే కచ్చితంగా సాధన చేయాలి. మనల్ని మనం కష్టపెట్టుకోవాలి. ఇవాళ్టి శ్రమ, రేపటి సౌందర్యానికి మార్గం వేస్తుంది. ఆ విషయాన్ని గట్టిగా నమ్మాలి. బాహ్య సౌందర్యం మాత్రమే కాదు అంతఃసౌందర్యం కూడా ముఖ్యమే. ఆత్మ సౌందర్యం అన్నిటికన్నా చాలా కీలకం. అందుకే ప్రతి పూటా దాని గురించి ఆలోచించాలి. తెలివితేటలు తెచ్చుకోవాలి అని అన్నారు సారా.
ఆమె ప్రస్తుతం గ్యాస్‌లైట్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ నెల 30న విడుదల కానుంది గ్యాస్‌లైట్. ఈ సినిమా తర్వాత ఏ వతన్ మేరే వతన్‌లో నటిస్తున్నారు. మర్డర్ ముబారక్‌లోనూ సారా నాయిక. విక్కీ కౌశల్‌తో ఓ సినిమా, అనురాగ్ బసుతో మెట్రో ఇన్ డినో కూడా పైప్‌లైన్‌లో ఉన్నాయి. చేయాలనుకున్న పని పట్ల 100 శాతం మనసుని లగ్నం చేస్తే రిజల్టులు వాటంతట అవే పాజిటివ్‌గా ఉంటాయన్నది సారాకి వాళ్ల నాన్న నేర్పిన సూత్రమట.