English | Telugu

రెండు డోసుల వ్యాక్సిన్ త‌ర్వాత పాజిటివ్‌.. ఐసీయూలో వెట‌ర‌న్ యాక్ట‌ర్‌!

బాలీవుడ్ వెట‌ర‌న్ యాక్ట‌ర్‌, క‌రిష్మా క‌పూర్‌-క‌రీన్ క‌పూర్ తండ్రి ర‌ణ‌ధీర్ క‌పూర్‌ను ముంబైలోని కోకిలాబెన్ అంబానీ హాస్పిట‌ల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చారు. రీసెంట్‌గా ఆయ‌న‌కు కొవిడ్‌-19గా నిర్ధార‌ణ అయ్యింది. అదివ‌ర‌కే ఆయ‌న రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. అంత‌కుముందు త‌న‌కు ఎలాంటి శ్వాస స‌మ‌స్య‌లు లేవ‌నీ, అందువ‌ల్ల త‌న‌కు ఐసీయూ బెడ్ అవ‌స‌రం లేద‌నీ చెప్పారు. అయితే మ‌రిన్ని క‌రోనావైర‌స్ సంబంధిత టెస్టులు జ‌ర‌ప‌డం కోస‌మే ఆయ‌న‌ను ఐసీయూకు త‌ర‌లించిన‌ట్లు స‌మాచారం. త‌న విష‌యంలో హాస్పిట‌ల్ స్టాఫ్ చాలా శ్ర‌ద్ధ తీసుకుంటున్నార‌ని ర‌ణ‌ధీర్ క‌పూర్ చెప్పారు.

"హాస్పిట‌ల్ నా విష‌యంలో చాలా శ్ర‌ద్ధ తీసుకుంటోంది. ఇందుకు టీనా అంబానీకి థాంక్స్ చెప్తున్నా. అంతా కంట్రోల్‌లోనే ఉంది. అన్ని స‌మ‌యాల్లో డాక్ట‌ర్లు నా చుట్టూ ఉంటున్నారు." అని ఆయ‌న తెలిపారు. కొవిడ్‌-19 వాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్ప‌టికీ త‌న‌కు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింద‌ని గురువారం ఆయ‌న వెల్ల‌డించారు.

"నాకు కొవిడ్ ఎలా సోకిందో తెలీడం లేదు. నాకు ఆశ్చ‌ర్యంగా ఉంది. నా సిబ్బంది మొత్తం ఐదుగురికీ కూడా పాజిటివ్‌గా టెస్ట్‌లో నిర్ధార‌ణ అయ్యింది. వారిని కూడా నాతో పాటు కోకిలాబెన్ అంబానీ హాస్పిట‌ల్‌లో చేర్పించాను." అని ఆయ‌న తెలిపారు. త‌న భార్య బ‌బిత‌, కూతుళ్లు క‌రిష్మా, క‌రీనా టెస్ట్‌లో నెగ‌టివ్‌గా తేలార‌ని ర‌ణ‌ధీర్ క‌పూర్ చెప్పారు. ఆయ‌న ఆరోగ్య స్థితి నిల‌క‌డ‌గా ఉంద‌నీ, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏమాత్రం లేద‌నీ డాక్ట‌ర్లు తెలిపారు.

ఇటీవ‌లే త‌న సోదరులు రిషి క‌పూర్‌, రాజీవ్ క‌పూర్ ఇద్ద‌రినీ ర‌ణ‌ధీర్ క‌పూర్ కోల్పోయారు. రెండేళ్ల పాటు కేన్స‌ర్‌తో పోరాడి 2020లో రిషి మృతి చెంద‌గా, గుండె పోటుతో ఈ ఏడాది మొద‌ట్లో రాజీవ్ మ‌ర‌ణించారు.