English | Telugu

ఉపాధి క‌రువై.. ఇంటి అద్దె క‌ట్ట‌లేని దుస్థితిలో టీవీ భీష్ముడు!

ఎపిక్ టీవీ సిరీస్ 'శ్రీ‌కృష్ణ‌'లో భీష్మ పితామ‌హునిగా, 'మ‌హాబ‌లి హ‌నుమాన్' సీరియ‌ల్‌లో బ్ర‌హ్మ‌దేవునిగా న‌టించి ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న సునీల్ నాగ‌ర్ ప్ర‌స్తుత మ‌హ‌మ్మారి కాలంలో సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్నారు. ఒక‌వైపు ప‌ని దొర‌క్క‌, మ‌రోవైపు కూడ‌బెట్టిన సొమ్మంతా ఖాళీ అయిపోవ‌డంతో ఆర్థిక క‌ష్టాల‌ను అనుభ‌విస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌తో ముంబైలోని ఓషివ‌రా ఏరియాలో ఉన్న సొంత ఇంటిని ఆయ‌న అమ్ముకోవాల్సి వ‌చ్చింది.

ముంబైలోనే ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్న ఆయ‌న సేవింగ్స్ అన్నీ అయిపోవ‌డంతో దిన‌స‌రి ఖ‌ర్చుల కోసం ఇబ్బంది ప‌డుతుండ‌టం బాధాక‌రం. ఆర్థిక సాయం కోసం సోష‌ల్ మీడియాలో ఆయ‌న బ్యాంక్ డిటైల్స్‌, ఆయ‌న ఫొటో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇది నిజ‌మేనా అని మీడియా ఆయ‌న‌ను సంప్ర‌దించ‌గా, తాను ఎవ‌రి సాయం కోర‌న‌ని చెప్తూనే త‌న ప‌రిస్థితి మాత్రం బాగోలేద‌ని చెప్పారు.

"దీనికి ఎవ‌రిని నిందించాలో నాకు తెలీడం లేదు. ప‌ని ఉన్న‌ప్పుడు నేను బాగానే సంపాదించాను. చాలా హిట్ సీరియ‌ల్స్, సినిమాలు చేశాను. జనానికి నా న‌ట‌న న‌చ్చి, మ‌రిన్ని అవ‌కాశాలు ఇచ్చారు. ఇవాళ ఇండ‌స్ట్రీలోని నాలాంటి బెస్ట్ యాక్ట‌ర్ల‌కు కూడా ప‌ని దొర‌క‌డం లేదు. నేను ట్రైన్ అయిన సింగ‌ర్‌ని కూడా. కొన్ని రోజుల క్రితం ఓ రెస్టారెంట్‌లో పాట‌లు పాడే ప‌ని వ‌చ్చింది. నా రోజువారీ ఖ‌ర్చులు కూడా వారే చూసుకుంటూ వ‌చ్చారు. కానీ లాక్‌డౌన్‌తో ఆ రెస్టారెంట్‌ను మూసేశారు. కొన్ని నెల‌లుగా రెంట్ కూడా క‌ట్ట‌లేని దుస్థితిలో ప‌డ్డాను." అని త‌న ద‌య‌నీయ స్థితిని తెలియ‌జేశారు సునీల్‌.

కొడుకుతో, అత‌ని కుటుంబంతో ఏర్ప‌డిన గొడ‌వ‌ల కార‌ణంగా వారు త‌న‌ను వ‌దిలేశార‌ని ఆయ‌న చెప్పారు. ఆయ‌న ఫ్యామిలీని గురించి అడిగిన‌ప్పుడు భావోద్వేగంతో మాట్లాడ‌లేక‌పోయారు.