English | Telugu

అమ్మ స్మితా పాటిల్ పేరును గుండెపై రాయించుకున్న ప్ర‌తీక్‌!

అమ్మ‌, లెజెండ‌రీ యాక్ట్రెస్ స్మితా పాటిల్ లేని లోటు బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌కు ఎన్న‌టికీ తీర‌నిది. అమ్మ‌ను త‌లుచుకోని క్ష‌ణం ఉండ‌దు అత‌డికి. రీసెంట్‌గా అమ్మ పేరును త‌న గుండెపై రాయించుకున్నాడు ప్ర‌తీక్‌. అట్లా అమ్మ‌ను శాశ్వతంగా చెరిగిపోని గుర్తుగా చేసుకున్నాడు. న‌టుడు, రాజ‌కీయ‌వేత్త రాజ్ బ‌బ్బ‌ర్‌, దివంగ‌త న‌టి స్మితా పాటిల్ దంప‌తుల‌కు పుట్టాడు ప్ర‌తీక్‌. ప‌సిత‌నంలోనే అత‌ను అమ్మ‌ను కోల్పోయాడు. అంత త్వ‌ర‌గా అమ్మ‌ను త‌న నుంచి దూరం చేసినందుకు దేవుడంటే అత‌డికి కోపం.

ఇవాళ‌, త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అత‌డు షేర్ చేసిన ఫొటోలో స‌రికొత్త టాట్టూతో క‌నిపిస్తున్నాడు. అనాచ్ఛాదితంగా ఉన్న ఛాతీపై స‌రిగ్గా గుండెల‌పై "స్మిత" అనే అత‌డి త‌ల్లి పేరు క‌నిపిస్తోంది. ఆ ఫొటోకు "inked my mother’s name on my heart.. smita #4ever 1955 - ♾" అనే క్యాప్ష‌న్ జోడించాడు.

ఇదివ‌ర‌కు మే 13న ఓ సినిమాలో తండ్రి రాజ్ బబ్బ‌ర్‌, త‌ల్లి స్మితా పాటిల్ క‌లిసున్న ఓ ఫొటోను షేర్ చేశాడు. ఆ ఇమేజ్ ఆ ఇద్ద‌రు తార‌ల గోల్డెన్ డేస్‌ను మ‌రోసారి గుర్తుచేసింది. ఆ మెస్మ‌రైజింగ్ ఫొటోకు, "#wbw #wayback #Wednesday meet the parents #flashback #greatness.” అనే క్యాప్ష‌న్ పెట్టాడు ప్ర‌తీక్‌.

అమ్మ‌మ్మ తాత‌య్య‌లు విద్యావ‌తి, శివాజీరావ్ గిరిధ‌ర్ పాటిల్ ద‌గ్గ‌ర పెరిగాడు ప్ర‌తీక్‌. అత‌డిని క‌న్న త‌ర్వాత‌, 31 ఏళ్ల వ‌య‌సులో బాలింత స‌మ‌స్య‌ల‌తో స్మిత ఆక‌స్మికంగా మృతి చెందారు. త‌ల్లి ఎలా ఉంటుందో ప్ర‌త్య‌క్షంగా చూడ‌లేదు ప్ర‌తీక్‌. త‌ల్లి లేని లోటు తెలియ‌కుండా గ్రాండ్ పేరెంట్స్ పెంచారు. అందుకే తండ్రి కంటే వారికే ఎక్కువ స‌న్నిహిత‌మ‌య్యాడు. కానీ పెరిగి పెద్ద‌య్యేకొద్దీ త‌ల్లి అంటే అత‌డికి ప్రేమాభిమానాలు అంత‌కంత‌కూ పెరుగుతూ వ‌చ్చాయే కానీ త‌ర‌గ‌లేదు. ఇప్పుడు టాట్టూతో అమ్మ‌ను శాశ్వ‌తంగా త‌న గుండెల‌పైనే ముద్రించుకున్నాడు ప్ర‌తీక్‌.