English | Telugu

OMG 2: శివుని వేషంలో అక్షయ్!

రిలీజ్ డేట్‌తో పాటు తన సినిమా 'ఓ మై గాడ్ 2' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ షేర్ చేశాడు. ఆగస్ట్ 11న ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నది. ముఖమంతా విభూతి రాసుకున్న శివుని రూపంలో ఆయన కనిపిస్తున్నాడు. ధోవతి ధరించి, మెడలో రుద్రాక్ష మాల వేసుకొని, మోకాలి దాకా సాగిన జడలతో, చేతిలో ఢమరుకంతో ఆయన కనిపిస్తున్నాడు.

పోస్టర్‌తో పాటు, "మేం వస్తున్నాం, మీరో మాతో రండి. 11 ఆగస్ట్. థియేటర్లలో. OMG 2" అని రాసుకొచ్చాడు అక్షయ్. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న యామి గౌతం కూడా డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను షేర్ చేసింది. ఆ పోస్టర్‌ను చూసి, అక్షయ్ ఫ్యాన్స్ చాలామంది "హరహర మహాదేవ్" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఆసక్తికరమైన విషయమేమంటే.. OMG 2 బాక్సాఫీస్ దగ్గర మరో సీక్వెల్‌ని ఢీకొట్టనుండటం. అది.. సన్నీ డియోల్, అమీషా పటేల్ నటిస్తోన్న 'గదర్ 2: ద కథ కంటిన్యూస్'. శివునిగా తన వేషాన్ని 2021లోనే అక్షయ్ పంచుకున్నాడు. అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా ఆ ఫిల్మ్ మేకింగ్‌లో జాప్యం జరిగింది.

భారతీయ విద్యావ్యవస్థ తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు. పరీక్షల ఒత్తిళ్లు, కాలేజ్ అడ్మిషన్లు లాంటి అంశాలను ఈ సినిమా స్పృశిస్తుంది. అక్షయ్, యామితో పాటు పంకజ్ త్రిపాఠి ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అమిత్ రాయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని వయాకాం 18 స్టూడియోస్ నిర్మిస్తోంది.