Read more!

English | Telugu

అందుకే బాలీవుడ్‌ చతికిలపడింది.. నసీరుద్దీన్‌ షా ఆవేదన!

ఒకప్పుడు బాలీవుడ్‌ ఇండస్ట్రీ టాలీవుడ్‌ కంటే ఎంతో ముందుండేది. రాను రాను బాలీవుడ్‌ తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిరది. ఓ పక్క ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలోనే టాలీవుడ్‌ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ముందుకు దూసుకెళ్తోంది. బాలీవుడ్‌లో ఎంతటి భారీ సినిమాలు తీసినా ఆశించిన విజయాల్ని అందుకోలేకపోతున్నారు. ఈ విషయమై గతంలో కూడా ఎంతో నటీనటులు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. తాజాగా ఈ విషయాన్ని మరోసారి తనదైన శైలిలో సీనియర్‌ నటుడు నసీరుద్దీన్‌ షా ప్రస్తావించారు. 

సినిమాలను కళాత్మకంగా తియ్యాలని, కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తే అందులో నాణ్యత అనేది లోపించి ప్రేక్షకులకు విరక్తి కలిగే అవకాశం ఉందని నసీరుద్దీన్‌ అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్‌ని వందేళ్ళ చరిత్ర కలిగిన ఇండస్ట్రీగా చెప్పుకుంటామని, అయితే ఈ వందేళ్ళుగా మూస సినిమాలే తీస్తున్నాం తప్ప కొత్తదనం ఎక్కడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. తీసిన కథలతోనే మళ్ళీ మళ్ళీ సినిమాలు తీసి జనంపై రుద్దుతున్నామని అన్నారు. అందుకే బాలీవుడ్‌ చతికిలపడిరదని అన్నారు నసీర్‌. ఇప్పుడొస్తున్న హిందీ సినిమాల్లో ఎలాంటి ప్రత్యేకతా ఉండడం లేదని అంటున్నారు. సినిమాల్లో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులకు తప్పకుండా బోర్‌ కొడుతుంది అంటున్నారు. 

గత కొన్నేళ్ళుగా బాలీవుడ్‌ సక్సెస్‌ రేట్‌ విపరీతంగా పడిపోయింది. అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా అక్కడి నటీనటులు ఈ విషయంపై కామెంట్‌ చేస్తుంటారు. హిందీ సినిమాల్లో క్వాలిటీ అనేది తగ్గిపోయిందని, తీసిన సినిమాలకే సీక్వెల్స్‌ అంటూ చేస్తున్నారు తప్ప కొత్త కథల కోసం ప్రయత్నాలు చేయడం లేదు. ఈమధ్యకాలంలో సినిమాల కంటే ఓటీటీకే ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో స్ట్రీమ్‌ అవుతున్న వెబ్‌ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు చూస్తుంటే బాలీవుడ్‌ ఎంత వెనకబడిపోతోందో అర్థమవుతోందని కొందరు సీనియర్‌ నటీనటులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఏడాది పఠాన్‌, జవాన్‌ చిత్రాలు మాత్రమే విజయం సాధించాయని, షారూఖ్‌ ఖాన్‌ మాత్రమే బాక్సాఫీస్‌ని షేక్‌ చేశాడని అంటున్నారు. అంతేకాదు, అక్షయ్‌కుమార్‌ సంవత్సరానికి లెక్కకు మించిన సినిమాలు చేస్తున్నా.. ఏ సినిమాకీ పెట్టుబడి కూడా రావడం లేదని సీనియర్‌ నటులు అంటున్నారు.