English | Telugu

ప్ర‌ఖ్యాత సంగీత ద‌ర్శ‌కుడు వ‌న‌రాజ్ భాటియా క‌న్నుమూత‌

ప్ర‌ఖ్యాత సంగీత ద‌ర్శ‌కుడు వ‌న‌రాజ్ భాటియా క‌న్నుమూత‌

 

ప్ర‌ఖ్యాత సంగీత ద‌ర్శ‌కుడు, భార‌త్‌లో న్యూ ఏజ్ సినిమాకు త‌న సంగీతంతో వ‌న్నెల‌ద్దిన‌ వ‌న‌రాజ్ భాటియా ఇక‌లేరు. శుక్ర‌వారం ఆయ‌న ముంబైలోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 93 సంవ‌త్స‌రాలు. శ్యామ్ బెన‌గ‌ల్ డైరెక్ట్ చేసిన 'అంకుర్‌', న‌సీరుద్దీన్ షా న‌టించిన క్లాసిక్ 'జానే భీ దో యారో' లాంటి న్యూ ఏజ్‌ సినిమాల‌కు స‌మ‌కూర్చిన సంగీతంతో వ‌న‌రాజ్ భాటియా పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించుకున్నారు. 

ఒంట‌రిగా జీవ‌నం సాగిస్తున్న ఆయ‌న‌కు తోడుగా ఇంటి నౌక‌రు మాత్రమే ఉంటున్నారు. ముంబైలోని నేపియ‌న్ సీ రోడ్‌లోని త‌న అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఆయ‌న వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో కొద్ది రోజులుగా మంచంపైనే ఉంటున్నారు. రెండు మాసాలుగా ఆయ‌న ఆరోగ్య స్థితి క్షీణిస్తూ వ‌చ్చింద‌ని స‌మాచారం. కొవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా డాక్ట‌ర్‌కు కూడా ఆయ‌న చూపించుకోవ‌డం లేద‌నీ, ఇటీవ‌ల ఆయ‌న‌కు ఆక‌లి కూడా తెలీకుండా పోయింద‌నీ తెలుస్తోంది.

పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో శిక్ష‌ణ పొందిన వ‌న‌రాజ్ లండ‌న్‌లోని రాయ‌ల్ అకాడ‌మీ ఆఫ్ మ్యూజిక్‌కు కూడా హాజ‌ర‌య్యారు. సినిమా, టీవీ, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు, రంగ‌స్థ‌ల రంగాల‌కు ఆయ‌న విశేష సేవ‌లందించారు.

వ‌న‌రాజ్ ప్ర‌తిభ‌కు అనేక ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డులు ల‌భించాయి. వాటిలో 'త‌మ‌స్' (1988) చిత్రానికి గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డు, 1989లో సంగీత నాట‌క అకాడ‌మీ అవార్డు, 2012లో ప‌ద్మ‌శ్రీ అవార్డు లాంటివి ఉన్నాయి. మంథ‌న్‌, 36 చౌరంఘీ లేన్‌, జునూన్‌, భూమిక‌, మండీ లాంటి గొప్ప చిత్రాల‌కు సంగీత‌క‌ర్త ఆయ‌నే.