English | Telugu

కంగ‌నా ర‌నౌత్‌పై కేసు న‌మోదు చేసిన కోల్‌క‌తా పోలీసులు

మత విద్వేషాల‌ను ప్రేరేపించినందుకు కంగనా రనౌత్‌పై తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి రిజు దత్తా ఫిర్యాదు చేశారు. రిజు దత్తా కోల్‌కతాలోని ఉల్తాదంగా పోలీస్ స్టేషన్‌లో చేసిన‌ ఫిర్యాదులో, కంగన ద్వేషపూరిత ప్రసంగం చేశారని ఆరోపించారు. కంగన తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ద్వేషపూరిత ప్రసంగం చేసి మత విద్వేషాల‌ను రేకెత్తించడానికి ప్రయత్నించారని రిజు ఆరోపించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిత్రాల‌ను వ‌క్రీక‌రించి వాటిని అప్‌లోడ్ చేస్తున్నారని రిజు ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కోల్‌కతా పోలీసులు ఐపీసీ 153 ఎ, 504, 505 సెక్ష‌న్ల‌తో పాటు, ఐటీ చ‌ట్టంలోని 43, 66 సెక్ష‌న్ల‌ కింద కంగ‌నా ర‌నౌత్‌పై కేసు నమోదు చేశారు.

మే 3 న కంగనపై ఒక న్యాయవాది కూడా ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌ కంగనకు సంబంధించిన‌ మూడు ట్వీట్ల లింకులను షేర్ చేశారు. ఆమె "బెంగాల్ ప్రజల మనోభావాలను కించపరిచింది, అవమానించింది, బాధించింది" అని త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

టిఎంసి ప్రతినిధి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ 'నా గొంతును చంపుతున్నారు' అని ఆరోపించిన కంగ‌న‌, "మీరు ప‌లు కేసులు లేదా ఎఫ్ఐఆర్లతో నన్ను భయపెట్టలేరు" అని అన్నారు. త‌మ సైట్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించే ట్వీట్లను పోస్ట్ చేసిన కంగన ఖాతాను మే 4 న ట్విట్ట‌ర్‌ శాశ్వతంగా నిలిపివేసింది. త‌న‌ వరుస ట్వీట్లలో, మమతా బెనర్జీపై ఆమె అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది.