English | Telugu

శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా ఇంట్లో 70 అశ్లీల చిత్రాల వీడియోలు!

అశ్లీల చిత్రాల నిర్మాణంలో పాత్ర ఉంద‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా (శిల్పాశెట్టి భ‌ర్త)ను అరెస్ట్ చేసిన ఒక‌రోజు త‌ర్వాత అత‌ని ఇంట్లో సోదాలు నిర్వ‌హించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కంప్యూట‌ర్ స‌ర్వ‌ర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓటీటీ యాప్ హాట్‌షాట్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ తొలిగించిన త‌ర్వాత ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక గురించి రాజ్ కుంద్రా, అత‌ని భాగ‌స్వాముల మ‌ధ్య జ‌రిగిన వాట్సాప్ సంభాష‌ణ‌ల‌ను పోలీసులు క‌నిపెట్టారు.

భిన్న నిర్మాణ సంస్థ‌ల సాయంతో కుంద్రా మాజీ పీఏ ఉమేశ్ కామ‌త్ చిత్రీక‌రించిన 70 అశ్లీల చిత్రాల వీడియోల‌ను కూడా క్రైమ్ బ్రాంచ్ స్వాధీనం చేసుకుంది. విచార‌ణ సంద‌ర్భంగా కుంద్రా పోలీసుల‌కు ఏమీ వెల్ల‌డించ‌లేదని తెలిసింది. ఇంగ్లండ్‌కు చెందిన త‌న షెల్ కంపెనీ కిన్రిన్‌కు అశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేయ‌డానికి సర్వ‌ర్‌ను కుంద్రా ఉప‌యోగించాడా, లేదా అని తెలుసుకోవ‌డానికి పోలీసులు దానిని ఫోరెన్సిక్ విశ్లేష‌ణ కోసం పంపుతారు. గ‌త రెండేళ్లుగా కుంద్రా, అత‌ని కంపెనీ బ్యాంక్ అకౌంట్ల వివ‌రాల‌ను అంద‌జేయాల్సిందిగా వివిధ బ్యాంకుల‌కు ఇప్ప‌టికే వారు లేఖ‌లు రాశారు. గ‌త రెండేళ్లుగా కుంద్రా అశ్లీల చిత్రాల వ్యాపారం న‌డుపుతున్నాడ‌ని పోలీసులు చెప్పారు.

సోమ‌వారం లోటస్ గ్రాండియ‌ర్‌లోని కుంద్రాకు చెందిన వ‌యాన్ ఇండ‌స్ట్రీస్, అంధేరిలో ఉన్న వీర‌దేశాయ్ రోడ్‌లోని జె.ఎల్‌. స్ట్రీమ్ కార్యాల‌యాల్లో పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సోదాల్లో కుంద్రాకు, అత‌ని బావ‌మ‌రిది అయిన ప్ర‌దీప్ బ‌క్షి మ‌ధ్య జ‌రిగిన అగ్రిమెంట్ల లాంటి ప‌త్రాలు ల‌భించాయి. బ‌క్షి ఇంగ్లండ్‌కు చెందిన కిన్రిన్ కంపెనీ య‌జ‌మాని.