English | Telugu
ఈసారి పాలిచ్చే వీడియోను షేర్ చేయమన్న నెటిజన్‌కు హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్!
Updated : Jul 20, 2021
బాలీవుడ్ తార నేహా ధూపియా ఇటీవల తను రెండోసారి గర్భవతినయ్యానంటూ భర్త అంగద్ బేడి, కూతురు మెహర్‌తో కలిసివున్న ఫొటోను షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఫొటోలో ఆమె నిండు నెలల గర్భిణిగా కనిపించింది. నేహకు తొలి సంతానంగా 2018లో మెహర్ జన్మించింది. రెండోసారి తను గర్భం దాల్చిన విషయం తెలిసినప్పుడు అంగద్ కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో తాను ఆందోళన చెందాననీ, అయితే అంగద్ తనకు ధైర్యం చెప్పాడని కూడా ఆమె వెల్లడించింది.
తల్లులు ఎదుర్కొనే రకరకాల అంశాలపై ఓ తల్లిగా నేహ తన భావాలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే మహిళా సాధికారత గురించి కూడా ఆమె తన వాయిస్‌ను వినిపిస్తుంటుంది. కొన్ని నెలల క్రితం మెహర్‌కు పాలిస్తున్న ఓ ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటో చూస్తే ఎవరికైనా మాతృత్వ మధురిమే గుర్తుకువస్తుంది. అయితే సోషల్ మీడియాలో వక్రబుద్ధి ప్రదర్శించేవాళ్లకు కొదవలేదు కదా. ఒక నెటిజన్ ఆమెను ఈసారి పాలిస్తున్న వీడియోను షేర్ చేయమని కామెంట్ సెక్షన్‌లో రాశాడు.
సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యల్ని సెలబ్రిటీలు పట్టించుకోరు. కానీ నేహా ఆ నెటిజన్‌కు గట్టిగా సమాధానం చెప్పాలనుకుంది. ఓ నెటిజన్‌కు 'మీ అమ్మ లేదా అమ్మమ్మ ఫొటోను మీ పేజీలో చూడగలను. ఆమెను అడగండి. ఆమె మీకు చూపిస్తుంది' అని ఓ మహిళ రాసిన స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసింది. దాంతో పాటు, "జనరల్‌గా నేను ఇలాంటి కామెంట్స్‌ను తీసేస్తాను లేదంటే పట్టించుకోను. కానీ దీన్ని నేను వెలుగులోకి తెచ్చాను. ఇలాంటివాళ్లు అందరు అమ్మలకు తాము పాలిచ్చే స్థితిని ఇబ్బందికరంగా మార్చేస్తారు." అని చెప్పింది నేహ.