English | Telugu

అశ్లీల చిత్రాల కేసు నుంచి త‌ప్పించుకోడానికి రాజ్ కుంద్రా 25 ల‌క్ష‌లు లంచ‌మిచ్చాడా?

శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా పోలీస్ క‌స్ట‌డీలో ఉండ‌గా, అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో అత‌ని పాత్ర‌పై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిశితంగా ద‌ర్యాప్తు సాగిస్తున్నారు. తాజాగా కుంద్రాపై ప‌లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. మిడ్‌-డే టాబ్లాయిడ్ ప్ర‌కారం ఈ అశ్లీల చిత్రాల రాకెట్‌లో కింగ్‌పిన్‌గా భావిస్తున్న అర‌వింద్ శ్రీ‌వాస్త‌వ అలియాస్ య‌శ్ ఠాకూర్‌ మార్చిలో క‌నిపించ‌కుండా పారిపోయాడు.

అదే నెల‌లో అత‌ను యాంటీ-క‌రప్ష‌న్ బ్యూరో (ఏసీబీ)కి పంపిన ఓ ఇ-మెయిల్‌లో క్రైమ్ బ్రాంచ్ అధికారుల‌కు రాజ్ కుంద్రా రూ. 25 ల‌క్షలు లంచం ఇచ్చాడ‌ని ఆరోపించాడు. ఈ కేసులో అరెస్ట్ నుంచి త‌ప్పించుకోడానికే కుంద్రా ఈ ప‌నిచేశాడ‌ని య‌శ్ ఆరోపించాడు. ఈ మెయిల్‌ను ఏప్రిల్‌లో ముంబై పోలీస్ చీఫ్‌కు ఏసీబీ ఫార్వ‌ర్డ్ చేసిందంటున్నారు. అయితే దీనికి సంబంధించి మాట్లాడ‌టానికి ముంబై న‌గ‌ర పోలీస్ ఆఫీస‌ర్స్ నిరాక‌రించారు.

అశ్లీల చిత్రాల నిర్మాణంలో పాత్ర ఉంద‌నే అభియోగంపై జూలై 19న రాజ్ కుంద్రా అరెస్ట‌య్యాడు. అత‌నికి జూలై 23 దాకా పోలీస్ట్ క‌స్ట‌డీ విధించారు. కుంద్రా ఇంటిపై దాడి చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 70 అశ్లీల చిత్రాల వీడియోల‌ను స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ల స‌హ‌కారంతో కుంద్రా మాజీ పీఏ ఉమేశ్ కామత్ వీటిని తీశాడు. విచార‌ణ సంద‌ర్భంగా కుంద్రా పెద్ద‌గా ఏమీ వెల్ల‌డించ‌లేద‌ని పోలీసులు తెలిపారు.

కుంద్రాపై ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ యాక్ట్‌లోని 67ఏ సెక్ష‌న్ న‌మోదు చేయ‌డంపై అత‌ని లాయ‌ర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. ఎల‌క్ట్రానిక్ ప‌ద్ధ‌తిలో అశ్లీల కంటెంట్‌ను పంపించ‌డం నేరంగా ఈ సెక్ష‌న్ ప‌రిగ‌ణిస్తుంది. ఇవాళ ఓటీటీలోనూ ఈ త‌ర‌హా కంటెంట్ స్ట్రీమింగ్ అవుతోంద‌ని ఆయ‌న వాదించాడు.