English | Telugu
రామాయణాన్ని 'ఆదిపురుష్' అవమానించింది!
Updated : Jun 19, 2023
ప్రభాస్ సినిమా 'ఆదిపురుష్'ను చూసిన వారిలో చాలామంది దాన్ని విమర్శిస్తున్నారు. తాజాగా ఆ లిస్టులో హిందీ నటుడు ముఖేష్ ఖన్నా చేరారు. దూరదర్శన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సీరియల్ 'మహాభారత్'లో భీష్మునిగా ఆయన పాపులర్ అయ్యారు. 'ఆదిపురుష్' చిత్రాన్ని చూసిన ఆయన ఓం రౌత్ దాన్ని తీసిన విధానాన్ని తప్పుపట్టారు. రామాయణంను రౌత్ అవమానించాడని ఆయన ఆరోపించారు. ఆ సినిమాని బహిరంగంగా విమర్శించిన ఆయన రామాయణంను ఆ చిత్రం అగౌరవపరిచేట్లు ఉందన్నారు.
తన యూట్యూబ్ వ్లాగ్‌లో 'ఆదిపురుష్'ను తీసిన విధానాన్ని ఖండించిన ఆయన, "ఆదిపురుష్‌ను మించిన పెద్ద అగౌరవం రామాయణంకు ఇంకోటి ఉండదు. రామాయణం గురించి ఓం రౌత్‌కు ఏం తెలియదని కనిపిస్తోంది. అన్నింటికీ మించి రామాయణంను కలియుగంగా మార్చిన గొప్ప బుద్ధజీవి రచయిత మనోజ్ ముంతషీర్ శుక్లా. అర్థంపర్థం లేని సంభాషణలు, నిద్ర వచ్చేటటువంటి స్క్రీన్‌ప్లేతో స్లీపింగ్ పిల్స్ ఇవ్వలేని దాన్ని కూడా ఇచ్చే సినిమాని క్రియేట్ చేశాడు. ఎవరు రాసిన రామాయణంతోనూ సంబంధం లేని ఫిల్మ్ ఇది" అని రాసుకొచ్చారు.
రామాయణంకు ఓం రౌత్ చేసినదాన్ని చరిత్ర ఎప్పటికీ క్షమించదు, మర్చిపోదని కూడా ఆయన అన్నారు. "ఆ సినిమాని చూశాక, హాలీవుడ్ ఫిలిం మేకింగ్ ద్వారా రౌత్ ప్రభావితుడయ్యాడనేది స్పష్టమైంది. రామాయణంను ఆ స్టఫ్‌తో నింపేశాడు. సినిమాపరమైన స్వేచ్ఛ తీసుకోవాలనుకుంటే, ఫిక్షనల్ ఫిల్మ్ తీసుకోవచ్చు. కానీ దేవుళ్ల ఇమేజెస్‌తో ఆయన ఆడుకున్నాడు. రామాయణంను 'ఆదిపురుష్' రూపంలో ఒక భయంకర జోక్‌గా చూపించాడు" అని ఆయన దుయ్యబట్టారు.