Read more!

English | Telugu

'మ‌హాభార‌త్' భీముడు ప్ర‌వీణ్ కుమార్‌ ఇక‌లేరు

 

లెజెండ‌రీ డైరెక్ట‌ర్ బి.ఆర్‌. చోప్రా రూపొందించిన మెగా సీరియ‌ల్ 'మ‌హాభార‌త్‌'లో భీమునిగా న‌టించి, అశేష ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొందిన ప్ర‌వీణ్‌ కుమార్ 74 ఏళ్ల వ‌య‌సులో గ‌త రాత్రి మృతి చెందారు. చాలా కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఆజానుబాహువైన ప్ర‌వీణ్ కుమార్ క్రీడాకారుడు కూడా. పంజాబ్‌కు చెందిన ఆయ‌న న‌టునిగా కెరీర్‌ను ప్రారంభించ‌క ముందు హ్యామ‌ర్ త్రో, డిస్క‌స్ త్రో ప్లేయ‌ర్‌. స్పోర్ట్స్‌లో ప‌లు అవార్డుల‌ను ఆయ‌న అందుకున్నారు. ఆయ‌న అర్జున అవార్డు గ్ర‌హీత కూడా. క్రీడాకారుని కోటాలో బీఎస్ఎఫ్‌లో డిప్యుటీ కమాండెంట్‌గా ఉద్యోగం కూడా ఆయ‌న సంపాదించారు.

ప్ర‌ఖ్యాత సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వికాంత్ న‌గాయిచ్ డైరెక్ట్ చేసిన సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు ప్ర‌వీణ్ కుమార్‌. అయితే ఆ సినిమాలో ఆయ‌న‌కు ఒక్క డైలాగ్ కూడా లేదు. అయితే ఆ త‌ర్వాత కాలంలో అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమా 'షెహ‌న్‌షా'లో చేసిన ముఖ్తార్ సింగ్ క్యారెక్ట‌ర్ స‌హా ప‌లు పాత్ర‌ల‌ను ఆయ‌న చేశారు. ఆయ‌న చేసిన సినిమాల్లో క‌రిష్మా కుద్ర‌త్ కా, యుధ్‌, జ‌బ‌ర్ద‌స్త్‌, సింఘాస‌న్‌, ఖుద్‌గ‌ర్జ్‌, లోహా, మొహ‌బ్బ‌త్ కే దుష్మ‌న్‌, ఇలాకా లాంటివి వున్నాయి. తెలుగులోనూ 'కిష్కింధ కాండ' సినిమాలో ఆయ‌న న‌టించారు.

ఈ సినిమాల‌న్నీ ఒకెత్తు అయితే, 'మ‌హాభార‌త్' సీరియ‌ల్ ఒక్క‌టీ ఒకెత్తు అనే విధంగా ఆయ‌న‌కు పేరు తెచ్చిపెట్టింది. భీమ‌సేనుని పాత్ర‌లో ప్ర‌వీణ్ కుమార్ గొప్ప‌గా రాణించారు. బ‌లిష్ఠ‌మైన దేహం, ఆజానుబాహు రూపంతో ఆ పాత్ర‌కు స‌రిగ్గా స‌రిపోయార‌నే పేరు తెచ్చుకున్నారు. త‌ర్వాత కాలంలో రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన ఆయ‌న మొద‌ట ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి, 2013లో ఢిల్లీలోని వాజిర్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాక‌, బీజేపీలో చేరారు.