Read more!

English | Telugu

'కేజీఎఫ్-2' ప్రభంజనం.. 'బాహుబలి-2'ని మించిన కలెక్షన్స్

'కేజీఎఫ్-2' బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా హిందీలో ఆల్ టైం రికార్డులు సృష్టిస్తోంది. రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసి బాలీవుడ్ సినిమాలతో పాటు 'బాహుబలి-2' రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది.

బాహుబలి-2 హిందీలో 41 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తే 'కేజీఎఫ్-2' 53.95 కోట్లు రాబట్టింది. బాలీవుడ్ లో కూడా ఇదే హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ కావడం విశేషం. గతంలో 51.60 కోట్ల నెట్ తో 'వార్' మూవీ పేరిట ఉన్న రికార్డుని 'కేజీఎఫ్-2' బ్రేక్ చేసింది. రెండో రోజు కూడా హిందీలో బాహుబలి-2 ని మించిన కలెక్షన్స్ రాబట్టింది. రెండోరోజు బాహుబలి-2 కి 40.50 కోట్లు వస్తే 'కేజీఎఫ్-2' 46.79 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో రెండు రోజుల్లో 100.74 కోట్ల నెట్ వచ్చింది. వంద కోట్ల మార్క్ అందుకోడానికి బాహుబలి-2 కి మూడు రోజులు, 'ఆర్ఆర్ఆర్'కి ఐదు రోజులు పడితే 'కేజీఎఫ్-2'కి రెండు రోజులే పట్టడం విశేషం. మూడు, నాలుగు రోజులు వీకెండ్ కావడంతో నాలుగు రోజుల్లోనే 200 కోట్ల నెట్ మార్క్ ని అందుకునే అవకాశముంది అంటున్నారు. 

'కేజీఎఫ్-2' జోరు ఇలాగే కొనసాగితే మొదటి వారంలోనే హిందీలో 300 కోట్ల మార్క్ ని అందుకున్నా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.