English | Telugu
మాల్దీవుల్లో చిన్నకొడుకు ఆర్నెల్ల బర్త్‌డేని సెలబ్రేట్ చేసిన కరీనా!
Updated : Aug 22, 2021
ఆరు నెలల క్రితం కరీనా కపూర్ ఖాన్ రెండోసారి పండంటి కొడుకును కన్నది. అతనికి జెహ్ అలీఖాన్ అనే పేరు పెట్టుకున్నారు సైఫ్, కరీనా దంపతులు. జెహ్ పుట్టి ఆరు నెలలు అయిన సందర్భంగా కరీనా సెలబ్రేషన్స్ చేసుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఎవరూ మిస్ కాకూడని ఒక ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో జెహ్‌ను ఎత్తుకుని ఉన్న కరీనా అతడి తలపై ముద్దు పెట్టుకుంటోంది. ఆమె కళ్లు మాతృత్వ మధురిమను అనుభవిస్తున్నట్లు మూసుకొని ఉన్నాయి.
ఫొటోలో కరీనా బ్లాక్ బికినీ టాప్, పింక్ బాటమ్స్ ధరించి ఉండగా, జెహ్ డిజైనింగ్‌తో ఉన్న బ్లూ బీచ్ బాటమ్స్‌తో కనిపిస్తున్నాడు. తల్లీకొడుకుల వెనుక బ్యాక్‌డ్రాప్‌లో మాల్దీవుల్లోని సముద్రపు నీళ్లు కనిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ నీడలో ఒక రూఫ్‌కింద ఉన్నారు. కొడుకు ఆరునెలల బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసమే ఆ కుటుంబం మాల్దీవులకు వచ్చినట్లు అర్థమవుతోంది. ఫొటోలో జెహ్ చాలా ముద్దొస్తున్నాడు. ఆ ఫొటోకు "Love, happiness, and courage to you always. Happy 6 months my life" అనే క్యాప్షన్ జోడించింది కరీనా.
అంతకుముందు శుక్రవారం మాల్దీవులకు వచ్చినట్లు ఓ పోస్ట్ ద్వారా తెలియజేసింది. జెహ్‌ను ఛాతీపై పడుకోబెట్టుకొని ఉన్న సెల్ఫీ ఫొటోను షేర్ చేసింది కరీనా. అందులో జెహ్ హాయిగా అమ్మ ఎదపై నిద్రపోతున్నాడు.