English | Telugu

గాయంతో హాస్పిట‌ల్ పాలైన అభిషేక్! చూడ్డానికి వ‌చ్చిన అమితాబ్‌!!

ఆదివారం ముంబైలోని లీలావ‌తి హాస్పిట‌ల్‌కు తండ్రీకూతుళ్లు అమితాబ్ బ‌చ్చ‌న్‌, శ్వేతా బ‌చ్చ‌న్ నందా రావ‌డంతో, వారెందుకు అక్క‌డ‌కు వ‌చ్చారోన‌ని మీడియా ఆరా తీసింది. అమితాబ్ రొటీన్ చెక‌ప్ కోస‌మేమైనా వ‌చ్చారేమోన‌ని మొద‌ట అనుకున్నారు. ఆ త‌ర్వాత తెలిసింది.. అప్ప‌టికే హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయిన అభిషేక్ బ‌చ్చ‌న్‌ను చూడ్డానికి వ‌చ్చార‌ని. ఏమైనా వారు హాస్పిట‌ల్‌కు వ‌చ్చిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. గాయ‌ప‌డిన‌ అభిషేక్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవ‌డానికి అమితాబ్‌, శ్వేత హాస్పిట‌ల్‌కు వ‌చ్చార‌ని ఒక ఫొటోజ‌ర్న‌లిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అంత‌కు రెండు రోజుల క్రితం ఆగ‌స్ట్ 20న అభిషేక్‌, ఐశ్వ‌ర్యారాయ్‌, వాళ్ల కుమార్తె ఆరాధ్య త‌మ కారులోంచి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా కెమెరా కంటికి చిక్కారు. ఆ ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. ఎయిర్‌పోర్ట్‌లో భార్య‌, కుమార్తెను డ్రాప్ చేయ‌డానికి అభిషేక్ వ‌చ్చాడు. మ‌ణిర‌త్నం సినిమా 'పొన్నియ‌న్ సెల్వ‌న్' షూటింగ్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతుండ‌టంతో, అక్క‌డ‌కు వారిని పంప‌డానికి వ‌చ్చాడు జూనియ‌ర్ బ‌చ్చ‌న్‌. ఆ టైమ్‌లో అత‌ని కుడిచేతికి బ్యాండేజ్ వేసి ఉంది. చేతి వేళ్ల‌కు ప‌లు క‌ట్లు క‌ట్టి వున్నాయి.

అభిషేక్‌కు ఎప్పుడు, ఎక్క‌డ గాయ‌మైందనే విష‌యం వెల్ల‌డి కాలేదు. భార్య‌ను షూటింగ్‌కు పంపాక‌, అత‌ను చికిత్స నిమిత్తం లీలావ‌తి హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయ్యాడు. ప్ర‌స్తుతం అత‌ను తుషార్ జ‌లోటా డైరెక్ట్ చేస్తోన్న 'దాస్వి' మూవీలో న‌టిస్తున్నాడు.