English | Telugu
'ఫిజా' నిర్మాత కన్నుమూత!
Updated : Aug 21, 2021
హృతిక్ రోషన్, కరీనా కపూర్ తోబుట్టువులుగా నటించిన 'ఫిజా' మూవీ నిర్మాత ప్రదీప్ గుహ శనివారం కన్నుమూశారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు. స్టేజ్ 4 లివర్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్‌లోని ఐసీయూలో మూడు వారాల క్రితం అడ్మిట్ అయ్యారు. అంతకుముందు ఆయనకు ముంబైలోని బెస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్లు చికిత్స అందిస్తూ వచ్చారు. దురదృష్టవశాత్తూ కేన్సర్ తీవ్రరూపం దాల్చడంతో ఆయన పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. ప్రదీప్‌కు భార్య పాపియా, కుమారుడు సంకేత్ ఉన్నారు.
ప్రదీప్ మృతికి అగ్ర నిర్మాత, దర్శకుల్లో ఒకరైన సుభాష్ ఘాయ్ స్పందించారు. "గుడ్ బై మై ఫ్రెండ్ ప్రదీప్ గుహ. నాకు అవసరమైనప్పుడల్లా జెన్యూన్ లవ్, సపోర్ట్ అందించిన నీకెప్పుడూ రుణపడి ఉంటాను. మన ఇండస్ట్రీలోని పలువురు మేకర్స్‌లో నువ్వూ ఒకడివి. RIP MY FRIEND”. అని ఆయన ట్వీట్ చేశారు.
1993 ముంబై అల్లర్ల నేపథ్యంలో ఖాలిద్ మొహమ్మద్ డైరెక్షన్‌లో ప్రదీప్ నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ 'ఫిజా' (2000) విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టైటిల్ రోల్‌లో కరీనా నటించగా, ముంబై అల్లర్ల సమయంలో తప్పిపోయిన ఆమె సోదరుడు అర్మాన్‌గా హృతిక్ నటించాడు.
ద టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌లో సుమారు 3 దశాబ్దాల కాలం పనిచేసిన ప్రదీప్ గుహ ఆ గ్రూప్‌కు అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. 2005లో ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చి జీ టెలీఫిల్మ్‌లో సీఈవోగా చేరారు. మరణించే నాటికి ఆయన 9ఎక్స్ మీడియా ఎండీగా వ్యవహరిస్తున్నారు.