Read more!

English | Telugu

1947లో మనకు దక్కింది స్వాతంత్ర్యం కాదు 'భిక్ష'.. పిచ్చా లేక దేశద్రోహమా?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతుగా మాట్లాడే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పోల్చడంతో పాటు, పలుసార్లు మత విద్వేష వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన కంగనా.. తాజాగా భారతదేశ స్వాతంత్ర్యోద్యమాన్నే అవమానించేలా వ్యాఖ్యలు చేసి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది.

తాజాగా ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కంగనా.. భారత స్వాతంత్ర్యం గురించి దారుణ వ్యాఖ్యలు చేసింది. 'భారత్ కి నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చింది. 1947లో మనకు దక్కింది 'భిక్ష' మాత్రమే. దానిని మనం స్వాతంత్ర్యంగా పరిగణిస్తామా?' అంటూ 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన విషయాన్ని గుర్తు చేస్తూ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కంగనా వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక రాజకీయ పార్టీని పొగిడే క్రమంలో దేశం కోసం త్యాగాలు మహనీయులని అవమానించేలా మాట్లాడటం ఏంటి అంటూ నెటిజన్లు కంగనాపై విరుచుకుపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రీతి మీనన్ అయితే స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కంగనాపై చర్యలు తీసుకోవాలంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ సైతం సోషల్ మీడియా వేదికగా 'పిచ్చా లేక దేశద్రోహమా' అంటూ కంగనాపై విరుచుకుప‌డ్డారు. గతంలో జాతిపిత మ‌హాత్మాగాంధీ త్యాగాల‌ను అవ‌మానించడమే కాకుండా, గాంధీజీని హత్యచేసిన గాడ్సేను పొగిడారు. ఇప్పుడు మంగ‌ళ్ పాండే, రాణి ల‌క్ష్మీభాయి, భ‌గ‌త్ సింగ్, చంద్రశేఖర్‌ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ లాంటి లక్షలాది మంది వీరుల త్యాగాల్ని సైతం చులకన చేస్తున్నారు. దీన్ని ఏమనాలి?.. పిచ్చా లేక దేశ ద్రోహమా? అంటూ వరుణ్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.