English | Telugu

షుగ‌ర్ ఎక్కువై ఒక కాలు కోల్పోయిన 'జోధా అక్బ‌ర్' యాక్ట‌ర్‌!

'జోధా అక్బర్', 'యే హై మొహబ్బతే' నటుడు లోకేంద్ర సింగ్ రజావత్ రక్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్‌ ఎక్కువై కుళ్లిపోవ‌డం వల్ల ఒక కాలిని మోకాలికి దిగువన ఉన్న భాగాన్ని తొల‌గించాల్సి వచ్చింది. కొవిడ్‌-19 వ‌ల్ల ఉపాధి కోల్పోయిన ఆ నటుడు ఆర్థిక ఇబ్బందులతో, తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. అత‌ని చేతిలో చెప్పుకోదగిన ఉద్యోగ అవకాశాలు లేవు. "నేనేమీ చేయలేను. కోవిడ్ మహమ్మారికి ముందు బాగా పని చేస్తూ వ‌చ్చాను. ఆ త‌ర్వాత‌ పని బాగా తగ్గడం ప్రారంభమైంది. దాంతో పాటు ఇంట్లో కొంత ఆర్థిక ఒత్తిడి ఉండేది.” అని ఆయ‌న త‌న ప‌రిస్థితి తెలిపాడు.

కుళ్లిపోయిన లోకేంద్ర కాలు తొలగించ‌డం కోసం ముంబైలోని భక్తివేదాంత ఆసుపత్రిలో స‌ర్జ‌రీ జరిగింది. దాని గురించి మాట్లాడుతూ, “నా కుడి కాలి పాదంలో చిన్నపుండు ఏర్ప‌డింది. దానిని నిర్లక్ష్యం చేశాను. దాంతో అది బోన్ మారోలోకి చొచ్చుకుపోయి ఇన్‌ఫెక్షన్‌గా మారింది. ఆ వెంట‌నే నా శరీరంలో వ్యాపించింది. అలా కాలు కుళ్లిపోయింది. నన్ను నేను కాపాడుకోడానికి ఏకైక మార్గం, మోకాలి వరకు కుళ్లిపోయిన కాలును తొల‌గించ‌డం మాత్రమే.” అని చెప్పాడు లోకేంద్ర‌.

విషాదానికి దారితీసిన తన ఆరోగ్యంపై సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ఆయ‌న బాధ‌ప‌డ్డాడు. "దాదాపు 10 సంవత్సరాల క్రితం నాకు డయాబెటిస్ ప్రారంభమైనప్పుడు జాగ్రత్త తీసుకున్నాను. షూటింగ్ చేసేటప్పుడు న‌టుల‌కు నిర్ణీత సమయాలను పాటించ‌డానికి వీల‌వ‌దు. లంచ్‌, వ‌ర్క్‌ మా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దీనికి ఒత్తిడి తోడ‌వుతుంది. ఇవన్నీ మధుమేహానికి దారితీస్తాయి. అంతే కానీ స్వీట్లు ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల కాదు.” అని లోకేంద్ర చెప్పుకొచ్చాడు.

ఆయ‌న‌ శస్త్రచికిత్స కోసం సినీ-టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) ఆర్థిక సహాయం అందించింది. గాయం నయ‌మ‌య్యాక‌ కృత్రిమ కాలు పెట్టుకోవాల‌ని ఆయ‌న భావిస్తున్నాడు.