English | Telugu

డాన్స్ షోకు ఆబ్సెంట్‌.. రూ. 2 కోట్లు న‌ష్ట‌పోయిన శిల్పాశెట్టి!

డాన్స్ రియాలిటీ షో 'సూప‌ర్ డాన్స‌ర్ 4' జ‌డ్జిల్లో ఒక‌రైన శిల్పాశెట్టి త‌న భ‌ర్త, వ్యాపార‌వేత్త‌ రాజ్ కుంద్రా అరెస్ట‌యిన ద‌గ్గ‌ర్నుంచీ ఆ షో షూటింగ్‌కు డుమ్మా కొడుతూ వ‌స్తోంది. ఒక ఎపిసోడ్‌కు శిల్ప స్థానంలో క‌రిష్మా క‌పూర్ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించింది. నెక్ట్స్ ఎపిసోడ్‌లో రితేశ్ దేశ్‌ముఖ్‌, జెనీలియా దేశ్‌ముఖ్ క‌నిపించ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో 'సూప‌ర్ డాన్స‌ర్ 4' నుంచి శిల్ప త‌ప్పుకుందంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే ఆ షో ప్ర‌సార‌మ‌వుతున్న చాన‌ల్ నిర్వాహ‌కులు ఆమెను త‌ప్పించే ఆలోచ‌న ఏదీ చేయ‌లేద‌ని తెలిసింది. రాజ్ కుంద్రా కేసు ఓ కొలిక్కి వ‌చ్చాక ఆ షోకి శిల్ప తిరిగి వ‌స్తుందంటున్నారు.

ఆ షో షూటింగ్‌కు హాజ‌రు కానందు వ‌ల్ల శిల్ప‌కు రూ. 2 కోట్ల మేర న‌ష్టం వాటిల్లింద‌ని స‌మాచారం. ఆ షోలో అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్న జ‌డ్జి శిల్ప‌నే. ఒక్కో ఎపిసోడ్‌కు ఆమెకు రూ. 18 ల‌క్ష‌ల నుంచి 22 ల‌క్ష‌ల వ‌ర‌కు పారితోషికం అందుతోంది. వారానికి రెండు ఎపిసోడ్లు ప్ర‌సార‌మ‌వుతున్నాయి. దీని ప్ర‌కారం చూస్తే సుమారు రూ. 2 కోట్ల మేర‌కు శిల్ప ఆదాయం కోల్పోతోంది. మూడు వారాల్లోగా ఆమె షోకు తిరిగి రాక‌పోతే ఆ న‌ష్టం ఇంకా పెరుగుతుంది.

అశ్లీల చిత్రాల‌ను రూపొందించి, వాటిని మొబైల్ యాప్స్‌లో ప‌బ్లిష్ చేస్తున్నాడ‌నే అభియోగంతో రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.