Read more!

English | Telugu

ఒమిక్రాన్ ఎఫెక్ట్: హిందీ 'జెర్సీ' వాయిదా.. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' సంగతేంటి?

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన తెలుగు సూపర్ హిట్ మూవీ 'జెర్సీ' హిందీలో అదే పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా వేసినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

సెకండ్ లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ కోలుకుంటోంది. పుష్ప, 83 వంటి సినిమాలు హిందీలో భారీ వసూళ్లతో దూసుకుపోతూ బాలీవుడ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఓమిక్రాన్ చాప కింద నీరులా విస్తరిస్తూ మళ్ళీ సినీ పరిశ్రమ ఉత్సాహాన్ని నీరుగారుస్తుంది. ఆ ఒమిక్రాన్ కారణంగానే ఇప్పుడు హిందీ జెర్సీ వాయిదా పడింది.

ఒమిక్రాన్ విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. పలు రాష్ట్రాలు కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వమైతే నైట్ కర్ఫ్యూ విధించడంతో పాటు.. థియేటర్స్, ఫంక్షన్ హాల్స్, మాల్స్ తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు పయనించే అవకాశముంది. దానికి తోడు మహారాష్ట్రలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన 'జెర్సీ'ని మరోసారి వాయిదా వేస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ సినిమాని ఆలస్యంగానైనా థియేటర్స్ లో విడుదల చేస్తారా లేక నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారో చూడాలి.

ఒమిక్రాన్ కారణంగా 'జెర్సీ' వాయిదా పడటం 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. జనవరి 7 న ఆర్ఆర్ఆర్, జనవరి 14 న రాధేశ్యామ్ విడుదల కానున్నాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ విజృంభణ ఇలాగే కొనసాగితే 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' సినిమాలు కూడా వాయిదా పడతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.