English | Telugu

కొవిడ్ ఎఫెక్ట్‌... ఏడాది కాలంగా క‌లుసుకోని ధ‌ర్మేంద్ర‌-హేమ‌మాలిని దంప‌తులు!

దేశం కొవిడ్‌-19 సెకండ్ వేవ్‌తో అల్ల‌ల్లాడుతోంది. ప్ర‌తిరోజూ ల‌క్ష‌ల సంఖ్య‌లో ఈ వైర‌స్ బారిన‌ప‌డుతున్నారు. వారిలో చాలామంది మృత్యువాత కూడా ప‌డుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేదు.. పేద‌, ధ‌నిక తార‌త‌మ్యం లేదు.. అన్ని వ‌ర్గాల వారూ దీనికి బ‌ల‌వుతుండ‌టం చూస్తున్నాం. ప్ర‌జ‌ల క్షేమం కోసం ప్ర‌భుత్వాలు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలూ చేస్తున్నాయి. దేశంలోని కొన్ని న‌గ‌రాల్లో క‌రోనా ఉధృతి కార‌ణంగా లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా క‌రోనావైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఒక‌ప్ప‌టి బాలీవుడ్ హిట్ పెయిర్‌, నిజ జీవితంలోనూ క‌పుల్ అయిన ధ‌ర్మేంద్ర‌, హేమ‌మాలిని ఏడాది నుంచీ ఒక‌రినొక‌రు క‌లుసుకోలేద‌నే వార్త ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. హేమ‌మాలిని ఆమె ఇంట్లో ఆమె ఉండ‌గా, గ‌త ఏడాది లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌ట్నుంచీ లోనావాలాలోని త‌న ఫామ్‌హౌస్‌లోనే గ‌డుపుతున్నారు ధ‌ర్మేంద్ర‌.

ఏడాది పైనుంచే త‌న భ‌ర్త‌ను ఎందుకు క‌లుసుకోలేక‌పోతున్నార‌నే ప్ర‌శ్న‌కు హేమ‌మాలిని స‌మాధాన‌మిచ్చారు. ఇది ఆయ‌న క్షేమం కోస‌మేన‌ని ఆమె చెప్పారు. "ఇద్ద‌రం క‌లిసి క్వాలిటీ టైమ్ గ‌డ‌ప‌డం కంటే కూడా, ఆయ‌న ఆరోగ్యంగా ఉండాల‌ని మేం కోరుకుంటున్నాం." అని ఆమె అన్నారు. "ప్ర‌స్తుతం మ‌నం ఒక బాధాక‌ర ద‌శ‌లో ఉన్నాం. ఇంత‌కు మించి కూడా మ‌నం శాక్రిఫైజ్ చేయాల్సి వ‌చ్చినా మ‌నం దృఢంగా ఉండాలి." అన్నారు హేమ‌.

మ‌రోవైపు లోనావాలా ఫామ్ హౌస్‌లో ఏడాది కాలంగా ఉంటున్న ధ‌ర్మేంద్ర ఎప్ప‌టిక‌ప్పుడు అక్క‌డి నుంచి ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూనే ఉన్నారు. కరోనావైర‌స్ సృష్టిస్తోన్న విధ్వంసం చూస్తుంటే చాలా బాధ క‌లుగుతోంద‌నీ, ఈ టైమ్‌లో విశ్రాంతి తీసుకోవ‌డం కోస‌మే తాను ఫామ్‌హౌస్‌లో గ‌డుపుతున్న‌ట్లు తెలిపారు. ఆయ‌న షేర్ చేస్తున్న కొన్ని ఫొటోల్లో ఆవుల‌తో, ప‌క్షుల‌తో కాల‌క్షేపం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. అంద‌రూ వాక్సిన్ తీసుకోవాల‌నీ, ముఖ్యంగా వ‌య‌సు మ‌ళ్లిన‌వాళ్లంతా వాక్సిన్ తీసుకోవ‌డం అవ‌స‌ర‌మ‌నీ ఆయ‌న పిలుపునిచ్చారు. వాక్సినేష‌న్‌, సోష‌ల్ డిస్టాన్సింగ్ మాత్ర‌మే కొవిడ్ నుంచి మ‌న‌ల్ని కాపాడాతాయ‌ని ఆయ‌న చెప్పారు. జ‌నం మాస్కులు లేకుండా తిరుగుతుండ‌టం చూసి అప్సెట్ అవుతున్నాన‌ని ధ‌ర్మేంద్ర అన్నారు.