English | Telugu

అబార్ష‌న్ చేయించుకున్నాన‌ని ఫేక్ న్యూస్‌ రాయ‌డం వికృతం అనిపించింది!

తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాను ఫేక్ న్యూస్ బాధితురాలిగా మారాన‌ని చెప్పింది అందాల తార ఇలియానా. తాను ప్రెగ్నెంట్ అయ్యాన‌నీ, అబార్ష‌న్ చేయించుకున్నాన‌నీ రూమ‌ర్స్ వ‌చ్చాయ‌నీ ఆమె చెప్పింది. తాను ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన‌ట్లు కూడా త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేశార‌నీ ఆమె వాపోయింది.

బాలీవుడ్ హంగామాతో జ‌రిగిన‌ ఇంట‌ర్వ్యూలో ఆమెకు ఫేక్ న్యూస్ గురించిన ప్ర‌శ్న ఎదురైంది. దానికి ఆమె పెద్ద‌గా న‌వ్వేసింది. "నాపై కొన్ని ఫేక్ న్యూస్ ఉన్నాయి. నేను గ‌ర్భ‌వ‌తిన‌య్యాన‌నీ, అబార్ష‌న్ చేయించుకున్నాన‌నేది వాటిలో ఒక‌టి. వాళ్లు అలాంటి విష‌యాలు రాయ‌డం నిజంగా బాధాక‌రం. ఇది అస‌హ్య‌క‌రం." అని ఆమె చెప్పింది.

"నేను ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు, ప్ర‌య‌త్నించిన‌ట్లు కూడా కాదు.. వ‌చ్చింది. వెరీ శాడ్‌. నేను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాను కానీ బ‌తికానంట‌, నా ప‌నిమ‌నిషి ఈ న్యూస్‌ను ధ్రువీక‌రించిందంట‌. నాకు ప‌నిమ‌నిషే లేదు, నేను ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌లేదు. ఇలాంటి వార్త‌ల‌కు ఏమైనా అర్థ‌ముందా. అలాంటి విష‌యాలు వారికి ఎక్క‌డ దొరుకుతాయో నాకు తెలీదు." అంది ఇలియానా.

2018లో అప్ప‌టి బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా తొలి బిడ్డ‌ను క‌న‌బోతున్న‌ట్లు చాలా ఊహాగానాలు వెలువ‌డ్డాయి. ఏదేమైనా, తాను "ప్రెగ్నెంట్‌ను కాను" అని త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఆ రూమ‌ర్స్‌కు చెక్ పెట్టింది ఇలియానా.

'దేవ‌దాస్' మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టి, 'పోకిరి' మూవీ త‌ర్వాత టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ఇలియానా, 2012లో 'బ‌ర్ఫీ' మూవీతో బాలీవుడ్‌లోకి వెళ్లింది. ఆ త‌ర్వాత ముంబైలో ఉండ‌టానికే ప్రాధాన్యం ఇచ్చిన ఈ గోవా సుంద‌రి, 'ఫ‌టా పోస్ట‌ర్ నిక్‌లా హీరో', 'మై తేరా హీరో', 'రుస్తోమ్' లాంటి సినిమాలు చేసింది. చివ‌ర‌గా 2019లో వ‌చ్చిన 'పాగ‌ల్‌పంతి' మూవీలో క‌నిపించింది.

కుంభ‌కోణానికి పాల్ప‌డిన స్టాక్‌బ్రోక‌ర్ హ‌ర్ష‌ద్ మెహ‌తా జీవితం ఆధారంగా రూపొందిన‌ 'బిగ్ బుల్' మూవీతో గ‌త నెల‌లో డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి అడుగుపెట్టిందామె. అభిషేక్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర పోషించిన ఈ సినిమాని మొద‌ట థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ఓటీటీలో నేరుగా రిలీజ్ చేశారు.