English | Telugu

ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్‌: 'రూహీ' కంటే 'బెల్ బాట‌మ్‌'కు త‌క్కువ‌! షాక్‌లో అక్ష‌య్‌!!

కొవిడ్ టైమ్స్‌లో విడుద‌లైన అక్ష‌య్ కుమార్ సినిమా 'బెల్ బాట‌మ్' అంచ‌నాల‌కు సుదూరంగా మొద‌టి రోజు చాలా త‌క్కువ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అది రూ. 3 కోట్ల మార్కును కూడా అందుకోలేద‌ని ట్రేడ్‌ విశ్లేష‌కులు తెలిపారు. అక్ష‌య్ గూఢ‌చారిగా న‌టించిన 'బెల్‌ బాట‌మ్‌'కు విమ‌ర్శ‌కుల నుంచి మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. కానీ వ‌సూళ్లు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. తొలి రోజు ఈ సినిమా వ‌సూళ్లు రూ. 2.5 కోట్ల‌ నుంచి రూ. 2.75 కోట్ల మ‌ధ్య ఉంటాయ‌ని అంచ‌నా. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా మ‌హారాష్ట్ర‌లో థియేట‌ర్లు తెరుచుకులోదు. అయిన‌ప్ప‌టికీ మిగ‌తా ఏరియాల్లో ఆగ‌స్ట్ 19న మొహ‌రం ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు.

ఫ‌స్ట్ డే.. దేశ‌వ్యాప్తంగా చూస్తే ఒక్క ఢిల్లీలోనే 20 శాతం క‌లెక్ష‌న్ వ‌చ్చింది. ఉద‌యం ఆట‌లు డ‌ల్‌గా ఉన్నా, మౌత్ టాక్‌తో సాయంత్రానికి వ‌సూళ్లు పెరుగుతాయ‌ని అంచ‌నా వేసిన‌ప్ప‌టికీ అలా జ‌ర‌గ‌లేదు. దేశం మొత్తం మీద వెయ్యిలోపు థియేట‌ర్ల‌లో 'బెల్ బాట‌మ్' రిలీజ‌య్యింది. యావ‌రేజ్‌గా 15 నుంచి 20 శాతం ఆక్యుపెన్సీ న‌మోద‌యింది. కొవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్ల‌లో విడుద‌లైన తొలి పెద్ద సినిమా 'బెల్ బాట‌మ్‌'. కానీ జాన్వీ క‌పూర్-రాజ్‌కుమార్ రావ్ సినిమా 'రూహీ' (రూ. 3 కోట్లు), జాన్ అబ్ర‌హాం-కాజ‌ల్ అగ‌ర్వాల్ మూవీ 'ముంబై సాగా' (రూ. 2.82 కోట్లు) కంటే మొద‌టి రోజు 'బెల్ బాట‌మ్' త‌క్కువ వ‌సూళ్ల‌ను సాధించ‌డం క‌ల‌వ‌ర‌పెట్టే అంశం.

ఈ క్లిష్ట కాలంలో ప‌లు సినిమాలు థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ‌వుతున్నాయి. ఇటీవ‌ల అజ‌య్ దేవ్‌గ‌ణ్ ఫిల్మ్‌ 'భుజ్‌', సిద్ధార్థ్ మ‌ల్హోత్రా సినిమా 'షేర్‌షా' ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ‌య్యాయి.