Read more!

English | Telugu

సిక్కులపై షాకింగ్ కామెంట్స్.. కంగనా రనౌత్‌ పై కేసు నమోదు!

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరో వివాదంలో చిక్కుకుంది. మహాత్మా గాంధీని, భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఉద్దేశించి ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పలువురు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆమె తీరు మారలేదు. తాజాగా సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ వ్యాఖ్యానించి మరోసారి విమర్శలు ఎదుర్కొంటోంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిక్కులు ఈ రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. వారి పోరాటంతో కేంద్రం దిగొచ్చింది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే కంగనా మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అంతేకాదు సిక్కుపై దారుణమైన వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురవుతోంది.

వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై కంగనా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. సిక్కులను ఖలిస్తానీ ఉగ్రవాదులుగా ఆమె అభివర్ణించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వారిని చితకబాదారని.. ఇలాంటి వారందరికీ అలాంటి గురువు కావాలంటూ వ్యాఖ్యానించింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది సిగ్గుచేటు.. పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధిలో ఉన్న ప్రజలు చట్టాలు చేస్తారా అంటూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కంగనా వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ సోమవారం ముంబైలో సీనియర్ పోలీసు అధికారులను కలిసింది. కంగన పదే పదే సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని.. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  కోరింది. సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబైలోని అర్బన్‌ ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కంగనాపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.