English | Telugu
ప్రమోషన్ల కన్నా షూటింగ్ మీదే ఆసక్తి
Updated : Jun 24, 2023
నాకు సినిమాలను ప్రమోట్ చేయడం కన్నా, షూటింగ్ చేయడమంటేనే ఇష్టం అని అంటున్నారు నటుడు ఫాహద్ ఫాజిల్. నార్త్ మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలే పంచుకున్నారు పుష్ప విలన్ భన్వర్ సింగ్ షెకావత్. ఆయన నటించిన ధూమమ్ ఇటీవల విడుదలైంది. థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. థియేటర్లలో ఆడుతోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. హోంబలే సంస్థకు తొలి మలయాళ సినిమా ఇది. పాజిటివ్ రివ్యూలు వినిపిస్తున్నాయి. గుడ్ రన్ ఉంటుందని క్రిటిక్స్ అంటున్నారు. మామూలుగా శుక్రవారం రిలీజ్ ఉంటే చాలా మంది ఆర్టిస్టులకు నిద్ర ఉండదు. స్ట్రెస్‌ఫుల్‌గా కనిపిస్తారు. అయితే ఫాహద్ మాత్రం కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
ఆయన వర్క్ మీద ఆయనకున్న నమ్మకం అలాంటిది అని అంటారు ఈ హీరో. ధూమమ్‌ని ముందు కన్నడలో మాత్రమే తెరకెక్కించాలన్నది మేకర్స్ ప్లానింగ్ అట. కానీ మలయాళంలోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని అనుకున్నారట ఫాహద్. ప్రీ ప్యాండమిక్ టైమ్‌లో ఈ కథ విన్నారట. దీని గురించి మాట్లాడుతూ ``ఈ కథను నన్ను కన్నడలో చేయమన్నారు. అప్పట్లో నేను మలయళం బయట సినిమాలు చేయాలనుకోలేదు. అందుకే మలయాళంలో చేయమన్నా. కొన్నాళ్లకు మళ్లీ డైరక్టర్‌కి ఫోన్ చేస్తే, కథ హోంబలే సంస్థకు ఇచ్చేశానని అన్నారు. వాళ్లతో మాట్లాడి కథను మలయాళంలో తీశాం`` అని అన్నారు. ఈ చిత్రంలో డిస్కస్ చేసిన పాయింట్ చాలా కామన్‌గా ఉంటుందని అన్నారు ఫాహద్. ప్రతి ఇంట్లోనూ ఒక్కరైనా, ఈ పాయింట్‌కి కనెక్ట్ అవుతారని చెప్పారు.
ఇది ఇష్యూ బేస్డ్ సినిమా కాదని అన్నారు. ఇప్పుడు ఫాహద్ అన్నీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. తెలుగులో పుష్ప2 సెట్స్ మీదుంది. తమిళ్‌లో సినిమాలున్నాయి. హిందీలోనూ వరుస సినిమాలు చేస్తున్నారు. ఫ్రెష్ స్క్రిప్ట్ ఎక్కడున్నా సైన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలిపారు. తనకు సోషల్ మీడియా అకౌంట్ లేదన్నారు. కాలేజ్ టైమ్‌లో ఫేస్‌బుక్ వాడేవాడినని చెప్పారు. సోషల్ మీడియాలో కన్నా, వ్యక్తిగతంగానే జనాలకు కనెక్ట్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.