English | Telugu
'డోన్ట్ బ్రీత్ 2' ట్రైలర్ వచ్చేసింది.. ఒరిజినల్‌ను మించి భయపెడుతోందిగా!
Updated : Jul 1, 2021
ఫెడె అల్వారెజ్ రూపొందించిన 2016 నాటి హారర్ మూవీ 'డోన్ట్ బ్రీత్' విడుదల సమయానికి దాన్ని ఫ్రాంచైజీగా చెయ్యాలని నిర్మాతలు అనుకోలేదు. ఆ ఏడాది సమ్మర్‌కు రిలీజైన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ కావడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు పొందింది. లో బడ్జెట్‌తో నిర్మాణమైన ఆ సినిమా 160 మిలియన్ల కంటే కాస్త తక్కువగా వసూళ్లు సాధించింది. ఇది అనూహ్యం. దాంతో దానికి సీక్వెల్ తియ్యాలనే ఆలోచన మేకర్స్‌కు కలిగింది. ఫలితంగా త్వరలో 'డోన్ట్ బ్రీత్ 2' మన ముందుకు రాబోతోంది. ఒరిజినల్‌లో అంధుడైన నార్మన్ నోర్డ్‌స్ట్రామ్‌గా నటించిన స్టీఫెన్ లాంగ్ ఈ సీక్వెల్‌లో తన క్యారెక్టర్‌ను నిలబెట్టుకున్నాడు. ఆయనతో పాటు బ్రెండన్ సెక్స్‌టన్ III, మేడలిన్ గ్రేస్ ఈ సీక్వెల్‌లో ప్రధాన పాత్రలు పోషించారు.
ఒరిజినల్‌లో నార్మన్ క్యారెక్టర్ భయానకమైన విలన్‌గా కనిపించగా, ఈ సీక్వెల్‌లో ఆయన తనను చంపడానికి వచ్చిన దుష్టులపై పోరాడే వ్యక్తిగా కనిపించనున్నాడు. ఒరిజినల్ 'డోన్ట్ బ్రీత్' డైరెక్టర్ అల్వారెజ్ ఈ సీక్వెల్‌కు కేవలం ప్రొడ్యూసర్‌గా, సహ రచయితగా వ్యవహరిస్తుండగా, రోడో సయాగ్స్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. అల్వారెజ్‌తో కలిసి 'డోన్ట్ బ్రీత్ 2' స్క్రిప్టును అతను రూపొందించాడు.
లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఈ సీక్వెల్ ట్రైలర్ ఒరిజినల్ కంటే ఈ మూవీ మరింత టెర్రరైజ్ చేసేట్లుగా కనిపిస్తోంది. అంధుడిగా స్టీఫెన్ లాంగ్ నటన, ఆయన చేసే ఫైట్లు రోమాలు నిక్కబొడుచుకొనేలా, ఒళ్లు జలదరింపజేసేలా కనిపిస్తున్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ అవుతున్నాయి. ఆగస్ట్ 13న 'డోన్ట్ బ్రీత్ 2' థియేటర్లలో రిలీజ్ కానున్నది. చూసి, థ్రిల్ అవడమే తరువాయి.