English | Telugu

హీరో ఆత్మహత్య, ప్రియురాలు జైలుకి.. ఐదేళ్ళ తర్వాత ఏం జరిగింది?

సినీ పరిశ్రమలో కొందరి జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతుంటాయి. చిన్న చిన్న పొరపాట్లు వారి కెరీర్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ముఖ్యంగా నటీనటుల జీవితాలు ఊహించని మలుపులు తిరిగి చివరికి మరుగున పడిపోతుంటాయి. అలా బాలీవుడ్‌ హీరోయిన్‌ రియా చక్రవర్తి జీవితం కూడా తన ప్రమేయం లేకపోయినా ఒక హీరో ఆత్మహత్య విషయంలో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. దాంతో అప్పుడప్పుడే హీరోయిన్‌గా నిలదొక్కుకుంటున్న ఆమె కెరీర్‌ అర్థాంతరంగా ముగిసిపోయింది.

సినిమాల్లో నటించడం ద్వారా తన ప్రతిభను నిరూపించుకోవాలని ఇండస్ట్రీకి వచ్చిన రియా చక్రవర్తి.. 2012లో వచ్చిన ‘తూనీగ తూనీగ’ చిత్రంలో తొలిసారి నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. హీరోయిన్‌గా నిలదొక్కుకునే క్రమంలో బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో రిలేషన్‌లోకి వెళ్లింది. కొన్ని కారణాల వల్ల 2020లో సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్‌ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రియాపై పలు రకాల కేసులు నమోదు చేశారు. దీంతో ఆమె నెలరోజులపాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చి తన తప్పు ఏమీ లేదని ప్రూవ్‌ చేసుకునే ప్రయత్నం చేసింది. దాదాపు నాలుగున్నర ఏళ్ళు ఈ కేసు విచారణ జరిగింది. చివరికి ఈ కేసులో ఆమెకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది సీబీఐ.

2013లో నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌.. ఆ తర్వాత ఎం.ఎస్‌.ధోని వంటి మంచి చిత్రాల్లో హీరోగా నటించాడు. బాలీవుడ్‌లో వారసత్వ పోకడలు అధికంగా ఉన్నాయని, ఆ కారణంగా తను హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నానని సుశాంత్‌ ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఆ విషయంలో మానసిక ఆందోళనకు గురైన సుశాంత్‌.. 34 ఏళ్ళ వయసులో 2020 జూన్‌ 14న ముంబాయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సహజీవనం చేస్తున్న రియా ప్రేరేపించడం వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ కేసు ఏళ్ళ తరబడి విచారణ జరిగింది. ఆ క్రమంలోనే సుశాంత్‌, రియాకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి.

అన్నిరకాల దర్యాప్తులు పూర్తి చేసిన తర్వాత రియాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది సీబీఐ. అయితే అది తనకు ఆనందాన్ని ఇవ్వలేకపోయిందని రియా చెబుతోంది. సుశాంత్‌ సూసైడ్‌ కేసు తన కెరీర్‌ని, జీవితాన్ని మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పటివరకు అడపా దడపా అవకాశాలు వచ్చినా.. సుశాంత్‌ మరణం తర్వాత రియాను పట్టించుకున్నవారే లేకుండాపోయారు. ఆ తర్వాత ఆమెకు ఒక్క సినిమాలో కూడా అవకాశం రాలేదు. ఇటీవల రెండు టీవీ షోలలో మాత్రం పార్టిసిపేట్‌ చేసింది. ప్రస్తుతానికి రియా కెరీర్‌ ముగిసినట్టుగానే భావించాలి. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చిన రియా చివరికి ఏకాకిగా మిగిలిపోవడం అందర్నీ బాధిస్తోంది.