Read more!

English | Telugu

జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన షారుక్ ఖాన్ కొడుకు ఆర్య‌న్‌.. విజువ‌ల్స్ వైర‌ల్‌!

 

ముంబైలోని ఆర్థ‌ర్ రోడ్ జైలు నుంచి ఆర్య‌న్ ఖాన్ శ‌నివారం ఉద‌యం బ‌య‌ట‌కు వ‌స్తున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. క్రూయిజ్ షిప్ డ్ర‌గ్ కేసులో అరెస్ట‌యి, రిమాండ్ ఖైదీగా 23 రోజులుగా ఆ జైలులో ఉన్న ఆర్య‌న్ బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ప్పుడు అభిమానులు పెద్ద సంఖ్య‌లో అక్క‌డ గుమికూడారు. ఆర్య‌న్‌తో పాటు అత‌ని ఫ్రెండ్స్ అర్బాజ్ మ‌ర్చంట్‌, మున్‌మున్ ధ‌మేజా కూడా జైలు నుంచి విడుద‌ల‌య్యారు. వీరంద‌రికీ బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆర్డ‌ర్‌ను శ‌నివారం ఉద‌యం 5.30 గంట‌ల‌కు ప‌రిశీలించిన జైలు అధికారులు, ఆ త‌ర్వాత ఆర్య‌న్ విడుద‌ల‌కు చ‌ర్య‌లు ప్రారంభించారు.

ఈరోజు ఉద‌యాన్నే ఆర్య‌న్‌ను జైలు నుంచి తీసుకు రావ‌డానికి త‌న టీమ్‌తో షారుక్ ఖాన్ ఇంటి నుంచి బ‌య‌లుదేరి వెళ్లిన‌ట్లు మొద‌ట వార్త‌లు వ‌చ్చాయి. అయితే జైలు గేటు బ‌య‌ట ఫ్యాన్స్‌తో పాటు మీడియా కూడా గుమికూడి ఆత్రుత‌గా చూస్తుండ‌గా, షారుక్ బాడీగార్డ్ ర‌వి జైలు లోప‌ల‌కు వెళ్లి ఆర్య‌న్‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చాడు. షారుక్ జైలు ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేద‌నీ, ర‌వి మాత్ర‌మే వెళ్లాడ‌నీ, త‌న లీగ‌ల్ టీమ్‌తో మాట్లాడిన త‌ర్వాత‌ ముంబైలోని ఫోర్ సీజ‌న్స్ హోట‌ల్‌లో షారుక్‌ బ‌స చేయ‌నున్నాడ‌నీ తెలియ‌వ‌చ్చింది.

అంత‌కుముందు, శుక్ర‌వారం షారుక్ ఫ్రెండ్ జుహీ చావ్లా రూ. ల‌క్ష ష్యూరిటీ బాండ్ మీద సంత‌కం చేశారు. దాంతో ఆర్య‌న్ బెయిల్‌పై విడుద‌ల కావ‌డానికి మార్గం సుగ‌మం అయింది. శుక్ర‌వారం నుంచే షారుక్ ఇల్లు మ‌న్న‌త్‌ను లైటింగ్‌తో నింపేశారు. ఆ ఇల్లు చూస్తుంటే దీపావ‌ళి చాలా ముందుగానే వ‌చ్చిన‌ట్ల‌నిపిస్తోంద‌ని చుట్టుప‌క్క‌ల జ‌నాలు అంటున్నారు.