Read more!

English | Telugu

ఆర్య‌న్ ఖాన్ కోసం రూ. ల‌క్ష‌ బెయిల్ బాండ్‌పై సంత‌కం చేసిన జుహీ చావ్లా!

 

అక్టోబ‌ర్ 28న షారుక్ ఖాన్ ఫ్యామిలీ హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఆ రోజు బాంబే హైకోర్టు షారుక్‌-గౌరీ ఖాన్ కొడుకు ఆర్య‌న్‌కు బెయిల్ మంజూరు చేసింది. క్రూయిజ్ షిప్ డ్ర‌గ్ కేసులో ఆర్య‌న్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆర్య‌న్‌కు బెయిల్ మంజూరయ్యాక కోర్టు ద‌గ్గ‌ర త‌న లాయ‌ర్ల టీమ్‌తో షారుక్ న‌వ్వుతూ మాట్లాడుతూ క‌నిపించాడు. గౌరీ ఖాన్ అయితే ఇంటిద‌గ్గ‌ర భావోద్వేగంతో ఏడ్చేసింది. 

ఆర్య‌న్‌కు బెయిల్ రావ‌డంలో మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌త్గి కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న వాద‌న‌ల ముందు ఎన్సీబీ త‌ర‌పు లాయ‌ర్ల వాద‌న‌లు వెల‌వెల‌బోయాయి. డ్ర‌గ్ కేసులో ఆర్య‌న్ పాత్ర ఉన్న‌ట్లు నిరూపించ‌డంలో ఎన్సీబీ స‌రైన ఆధారాలు చూపించ‌లేక‌పోవ‌డంతో అత‌నికి బాంబే హైకోర్టు బెయిల్ ఇచ్చింది.

ఆర్య‌న్ బెయిల్‌కు సంబంధించి కోర్టు ఈరోజు కండిష‌న్ల‌తో కూడిన ఆర్డ‌ర్‌ను రిలీజ్ చేసింది. కాగా అక్టోబ‌ర్ 30 ఉద‌యం ఆర్థ‌ర్ రోడ్ జైలు నుంచి ఆర్య‌న్ విడుద‌ల కానున్న‌ట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. అంత‌కు ముందు కొన్ని గంట‌ల క్రితం షారుక్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్, న‌టి జుహీ చావ్లా కోర్టు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. ఆర్య‌న్ ఖాన్ త‌ర‌పున బెయిల్ ష్యూరిటీపై సంత‌కం చేసింది. ఆ ష్యూరిటీ విలువ ల‌క్ష రూపాయ‌లు. బెయిల్ బాండ్‌పై సంత‌కం పెట్ట‌డం ద్వారా షారుక్‌కు త‌ను నిజ‌మైన ఫ్రెండ్ అని జుహీ నిరూపించుకుంది.

అక్టోబ‌ర్ 2 త‌ర్వాత ఇన్నాళ్ల‌కు ఆర్య‌న్ త‌న ఇంట్లో త‌ల్లితండ్రుల‌ను, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ను క‌లుసుకోబోతున్నాడు. అత‌ని రాక సంద‌ర్భంగా షారుక్ ఇల్లు మ‌న్న‌త్‌ను లైటింగ్‌తో నింపుతున్నారు.