Read more!

English | Telugu

జ్వ‌రం పేరుతో సిట్ విచార‌ణ‌కు డుమ్మాకొట్టిన ఆర్య‌న్ ఖాన్‌!

 

క్రూయిజ్ షిప్ డ్ర‌గ్ కేసులో ఆదివారం విచార‌ణ‌కు ర‌మ్మంటూ ఆర్య‌న్ ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్‌కు సంబంధించిన స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ (సిట్‌) స‌మ‌న్లు జారీ చేసింది. అయితే త‌న‌కు జ్వ‌ర‌మ‌ని చెప్పి ఆ విచార‌ణ‌కు డుమ్మాకొట్టాడు ఆర్య‌న్‌. బాంబే హైకోర్టు అక్టోబ‌ర్ 28న బెయిల్ మంజూరు చేసిన త‌ర్వాత‌, తొలిసారి న‌వంబ‌ర్ 5న అత‌ను ఎన్సీబీ ఆఫీసుకు వ‌చ్చి సంత‌కం చేసి వెళ్లాడు. ప్ర‌తి శుక్ర‌వారం ఎన్సీబీ ఆఫీసులో అటెండెన్స్ వేయించుకోవాల‌ని బెయిల్ ఆర్డ‌ర్‌లో కోర్టు ఆదేశాలిచ్చింది. ఆరోజు త‌న లాయ‌ర్ నిఖిల్ మ‌నేషిండేతో క‌లిసి ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లాడు ఆర్య‌న్‌.

డ్ర‌గ్ కేసుకు మొద‌ట ఎన్సీబీ జోన‌ల్ డైరెక్ట‌ర్ స‌మీర్ వాంఖ‌డే నేతృత్వం వ‌హించ‌గా, ఆయ‌న‌పై వచ్చిన అవినీతి ఆరోప‌ణులు ద‌రిమిలా, ఆయ‌న‌ను ఆ కేసు విచార‌ణ నుంచి త‌ప్పించిన ఎన్సీబీ పై అధికారులు, ఆ బాధ్య‌త‌ల‌ను సీనియ‌ర్ ఆఫీస‌ర్ సంజ‌య్ కుమార్ సింగ్‌కు అప్ప‌గించారు. ఆర్య‌న్‌ను డ్ర‌గ్ కేసులో ఇరికించి, ఆ త‌ర్వాత దాన్నుంచి అత‌డిని త‌ప్పించ‌డానికి స‌మీర్ వాంఖ‌డే రూ. 8 కోట్ల లంచం డిమాండ్ చేశారంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం సంజ‌య్ సింగ్ నేతృత్వంలోని సిట్ బృందం ఆర్య‌న్ కేసును విచారిస్తోంది. 

అక్టోబ‌ర్ 2న క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన ఎన్సీబీ బృందం ఆర్య‌న్ స‌హా మ‌రికొంత‌మందిని అదుపులోకి తీసుకుంది. ఆ మ‌రుస‌టి రోజు ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద అత‌డిని అరెస్ట్ చేసింది.