English | Telugu

మీడియా దృష్టిని ఆక‌ర్షించ‌ని అనిల్ క‌పూర్‌, సునీత ప్ర‌గాఢ ప్రేమ‌గాథ‌!

 

ఆ ఇద్ద‌రి ల‌వ్ స్టోరీ మీడియా దృష్టిని పెద్ద‌గా ఆక‌ట్టుకోక‌పోవ‌చ్చు గాక‌, కానీ సినిమా ల‌వ్ స్టోరీకి వారి క‌థ ఏ మాత్రం త‌క్కువ కాదు. ఆ ఇద్ద‌రు.. అనిల్ క‌పూర్‌, ఆయ‌న భార్య‌ సునీత‌! వాళ్ల‌ది అసాధార‌ణ ప్రేమ‌గాథ‌. ఇవాళ ఆ ఇద్ద‌రు.. ముగ్గురు అంద‌మైన పిల్ల‌ల‌ను (సోన‌మ్ క‌పూర్‌, రియా క‌పూర్‌, హ‌ర్ష‌వ‌ర్థ‌న్ క‌పూర్‌) చూసుకొని గ‌ర్వ‌ప‌డే త‌ల్లిదండ్రులు.

ఇండ‌స్ట్రీలోని తొలినాళ్ల‌లో ప‌గ‌లు ప‌నికోసం చూసేవాడు అనిల్‌. రాత్రివేళ‌ల్లో ఆయ‌నా, ఫ్రెండ్స్ క‌లిసి కూర్చొని అనిల్‌కు త‌గిన జోడీని క‌నిపెట్ట‌డం కోసం ప్లాన్లు వేసేవారు. మ‌రోవైపు సునీత స‌క్సెస్‌ఫుల్ మోడ‌ల్‌. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న‌త స్థాయి హోదాలో ప‌నిచేస్తున్నారు. ఆ ఇద్ద‌రూ తొలిసారి క‌లుసుకొన్న త‌ర్వాత‌, మ‌ళ్లీ ఆమెను కాంటాక్ట్ చేయ‌డానికి అనిల్‌కు మార్గం క‌నిపించ‌లేదు. అయితే త‌న ఫ్రెండ్ ద్వారా ఆమె ఫోన్ నంబ‌ర్ సంపాదించాడు. అలా ఆ ఇద్ద‌రూ ఫోన్‌లో మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టారు.

కొన్ని వారాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నాక‌, ఇద్ద‌రం క‌లుసుకుందామ‌ని అడిగాడు అనిల్‌. ఆమె య‌స్ చెప్పింది. 1980లో ఓ ఆహ్లాద‌క‌ర‌మైన సాయంత్రం వేళ తొలిసారి ప్రేమికులుగా క‌లిశారు. అప్ప‌ట్నుంచీ ఒక‌రిపై ఒక‌రికి అనురాగం మ‌రింత పెరుగుతూ వ‌చ్చింది. త‌ర‌చూ క‌లుసుకోసాగారు. ఇద్ద‌రూ క‌లుసుకుంటున్న తొలినాళ్ల‌లో, ఆయ‌న బ‌స్‌లో వ‌స్తే, ఆమె క్యాబ్‌లో వ‌చ్చేది. ప్ర‌తిసారీ ఆయ‌న‌కు ఆమె ఏదో ఒక‌ గిఫ్ట్ ఇచ్చేది.

అనిల్‌, సునీత సాధ్య‌మైనంత ఎక్కువ స‌మ‌యం క‌లిసి గ‌డుపుతూ వ‌చ్చారు. ఆమెకు ఫొటోషూట్‌లు ఉంటే, అక్క‌డ‌కు కూడా వెళ్లేవాడు అనిల్‌. ఆయ‌న‌తో స‌మ‌యం గ‌డ‌ప‌డానికి ఆమె తన ఫొటోషూట్ల‌ను కేన్సిల్ చేసుకున్న సంద‌ర్భాలెన్నో. స‌క్సెస్‌ఫుల్ మోడ‌ల్ అవ‌డంతో మోడ‌లింగ్ అసైన్‌మెంట్స్ కోసం ఆమె అబ్రాడ్‌కు ట్రావెల్ చేసేది. ఒక‌సారి సునీత‌ను ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేయ‌డానికి అనిల్‌తో పాటు ఆయ‌న జిగ‌రీ దోస్త్ గుల్ష‌న్ గ్రోవ‌ర్ కూడా వెళ్లాడు.

“ఆమె 20 నుంచి 25 రోజుల పాటు ఉండేందుకు అబ్రాడ్‌కు ప్ర‌యాణం క‌ట్టింది. ఆమెను ఎంత‌గా మిస్స‌వుతున్నాడో మాట‌ల్లో చెప్ప‌డానికి బ‌దులు, ఆమె భుజంపై త‌ల‌పెట్టుకొని ప‌డుకున్నాడు” అనిల్ అని చెప్పాడు గుల్ష‌న్‌. దాన్నిబ‌ట్టి ఆయ‌న విష‌యంలో సునీత ఎంత కేరింగ్‌గా ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు. అనిల్‌ను సాధ్య‌మైనంత‌వ‌ర‌కు సౌక‌ర్యంగా ఉంచేందుకు ఆమె ప్ర‌య‌త్నించేది. ఆయ‌న‌పై ఆమె కోపం తెచ్చుకున్న సంద‌ర్భాలు చాలా చాలా త‌క్కువ‌.

ఆమె త‌న అసైన్‌మెంట్స్ కోసం విదేశాల్లో ఉన్న‌ప్పుడు ముంబైలో సినిమా చాన్సుల కోసం ఆడిష‌న్స్‌కు హాజ‌ర‌య్యేవాడు అనిల్‌. కానీ అదృష్టం ఆయ‌న‌కు దూరంగా ఉంటూ వ‌చ్చింది. అట్లా టాలీవుడ్‌లో బాపు డైరెక్ష‌న్‌లో హీరోగా ‘వంశ‌వృక్షం’ సినిమా కూడా చేశాడు అనిల్‌. బాలీవుడ్‌లో కొన్ని సైడ్ రోల్స్ చేశాక‌, ఎట్ట‌కేల‌కు ‘వో సాత్ దిన్’ (1983) మూవీ ఆయ‌న‌ను లైమ్‌లైట్‌లోకి తెచ్చింది. ఈ సినిమా రిలీజ‌య్యాక ఆయ‌న ప్ర‌తిభ‌నూ, ఆయ‌న‌లోని చార్మింగ్‌నూ పెద్ద ద‌ర్శ‌కులూ, నిర్మాత‌లూ గ్ర‌హించారు. ఆయ‌న‌కు అవ‌కాశాలు మొద‌ల‌య్యాయి. అయితే అనిల్ దృష్టి త‌న ప్రేయ‌సిని ఎప్పుడు పెళ్లాడ‌దామా అనే దానిపైనే ఉంది.

బాలీవుడ్‌లో స్ట్ర‌గుల్ పీరియ‌డ్ ముగిసిపోయింద‌ని ఆనంద‌ప‌డేంత‌లో, పెళ్లి విష‌యంలో స్ట్ర‌గుల్ ఎదురైంది అనిల్‌కు. వారి ప్రేమ వ్య‌వ‌హారం సునీత త‌ల్లిదండ్రుల‌కు న‌చ్చ‌లేదు. వారు అభ్యంత‌ర‌పెట్టారు. వాళ్ల‌ను క‌న్విన్స్ చేయ‌డానికి అనిల్ నానా తంటాలు ప‌డ్డాడు. ఆయ‌న‌తోటే త‌న జీవితం అని త‌ల్లిదండ్రుల‌కు గ‌ట్టిగా చెప్పేసింది సునీత‌. దాంతో వాళ్లు ఒప్పుకోక‌త‌ప్ప‌లేదు. కానీ ఇండ‌స్ట్రీ వ్య‌క్తులు అప్పుడే పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని అనిల్‌ను డిస్క‌రేజ్ చేస్తూ వ‌చ్చారు. ‘మ‌షాల్’ (1984) మూవీ సూప‌ర్ హిట్ కావ‌డంతో అనిల్ సెన్సేష‌న‌ల్ హీరోగా మారాడు. అప్పుడాయ‌న అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. అలాంటి టైమ్‌లో పెళ్లి చేసుకుంటే కెరీర్ అంత‌మైపోతుంద‌ని చాలామంది ఆయ‌న‌ను హెచ్చ‌రించారు. వాళ్ల స‌ల‌హాలు పాటించి రెండుసార్లు పెళ్లిని వాయిదా వేసుకున్నాడు అనిల్‌.

ఎట్ట‌కేల‌కు ఐదేళ్ల ప్రేమ‌బంధం త‌ర్వాత అన్ని అడ్డంకుల్నీ, న‌మ్మ‌కాల్నీ అధిగ‌మించి అనిల్‌, సునీత 1984 మే 19న పెళ్లి చేసుకున్నారు. ప్ర‌తి మ‌గాడి విజ‌యం వెనుక ఓ ఆడ‌ది ఉంటుంద‌నే నానుడి వారి విష‌యంలో ముమ్మాటికీ నిజం. అనిల్ కోసం సునీత త‌న కెరీర్‌ను శాక్రిఫైజ్ చేసింది. అయితే ఆయ‌న‌తో క‌లిసి ఓ అంద‌మైన జీవితాన్ని ఆమె నిర్మించింది. సినిమాల ఎంపిక విష‌యంలో నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఆమె సాయప‌డేది. చ‌క్క‌గా ఎలా డ్ర‌స్ చేసుకోవాలో ఆయ‌న‌కు నేర్పించింది. ఆయ‌న కాస్ట్యూమ్స్‌ను ఆమె డిజైన్ చేసేది. ఔట్‌డోర్ షూటింగ్‌ల‌ను ఆయ‌న‌తో పాటు వెళ్లేది. ఆమె త‌న ద‌గ్గ‌ర ఉండ‌టాన్ని ఆయ‌న బాగా ఇష్ట‌ప‌డేవాడు. బ‌హుశా అందువ‌ల్ల‌నేమో, పెళ్లి త‌ర్వాత ఓ స్టార్‌గా మ‌రింత స‌క్సెస్ అయ్యాడు అనిల్‌.

తెర‌పై మాధురీ దీక్షిత్‌తో అనిల్ కెమిస్ట్రీ సూప‌ర్‌గా వ‌ర్క‌వుట్ కావ‌డం, వారిది హిట్ పెయిర్ కావ‌డంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఎఫైర్ ఉందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం న‌డిచింది. ఆ త‌ర్వాత శిల్పా శిరోద్క‌ర్‌తో లింక్ పెట్టారు. కానీ అవి రూమ‌ర్స్‌గానే మిగిలాయి. అనిల్‌, సునీత మ‌ధ్య బంధం చెక్కుచెద‌ర‌లేదు. ఆ ఇద్ద‌రి ప‌ర‌స్ప‌ర అనురాగం చూసి బాలీవుడ్ మొత్తం వారిని ప్ర‌శంసిస్తుంటుంది. ద‌టీజ్ ట్రూ ల‌వ్ ఆఫ్ అనిల్ అండ్ సునీతా క‌పూర్‌!