English | Telugu

ప‌క్క‌న ఆలియా లేక‌పోతే ర‌ణ‌బీర్ బాత్‌రూమ్‌కు కూడా వెళ్ల‌డంట‌!

 

ఎన్న‌డూ ఊహించ‌నంత ఎక్కువ‌గా భార్య ఆలియా భ‌ట్ మీద తానెక్కువ‌గా ఆధార‌ప‌డుతుంటాన‌ని వెల్ల‌డించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ ర‌ణ‌బీర్ క‌పూర్‌. 2022 ఆ దంప‌తుల జీవితంలో మ‌ర్చిపోలేని సంవ‌త్స‌రంగా నిలిచింది. ఏప్రిల్‌లో వారు పెళ్లిచేసుకున్నారు. తాము త‌ల్లితండ్రులం కాబోతున్నామ‌ని జూన్‌లో ప్ర‌క‌టించారు. తొలిసారి జంట‌గా న‌టించిన 'బ్ర‌హ్మాస్త్ర' సినిమా సెప్టెంబ‌ర్‌లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. చెప్పాలంటే వాళ్ల ప్ర‌తి క‌ల నిజ‌మైంది. ఇప్పుడు ఆ జంట త‌మ జీవితాల్లోకి రాబోతున్న తొలి బిడ్డ కోసం ఆత్రుత‌గా రోజులు లెక్కిస్తున్నారు. 

'బ్ర‌హ్మాస్త్ర' సినిమాలో శివ‌, ఇషా పాత్ర‌ల్లో న‌టించారు ర‌ణ‌బీర్‌, ఆలియా. ఇషా లేక‌పోతే శివ లేడు అన్నంత‌గా వాళ్ల ప్రేమ ఆ సినిమాలో క‌నిపిస్తుంది. నిజ జీవితంలోనూ అంతేనా? అనే ప్ర‌శ్న ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ర‌ణ‌బీర్‌కు ఎదురైంది. ఆలియా క‌నుక ద‌గ్గ‌ర‌లో లేక‌పోతే త‌ను క‌నీసం బాత్‌రూమ్‌కు కూడా వెళ్ల‌న‌నీ, అలాగే ఏమీ తిన‌న‌నీ చెప్పాడు. ఆలియా త‌న జీవితాన్ని ఎన్న‌డూ లేనంత ఆనంద‌క‌రంగా మార్చేసింద‌ని అన్నాడు. 

"నేను చాలా ఇండిపెండెంట్‌న‌నీ, ఎవ‌రూ త‌న‌ను క‌దిలించ‌లేర‌నీ గొప్ప‌లు చెప్పుకొనేవాడ్ని. రియాలిటీకి వ‌స్తే, ఆలియాపై నేను బాగా ఆధార‌ప‌డుతుంటాను. ఆలియా ఎక్క‌డ ఉంద‌నే విష‌యం నాకు తెలీక‌పోతే నేను బాత్‌రూమ్‌కి కూడా వెళ్ల‌ను, ఏమీ తిన‌ను. ఆమె నా ద‌గ్గ‌ర ఉండ‌టం అనేది నాకు చాలా ముఖ్య‌మైన విష‌యం. మేం స‌ర‌సాలు ఆడుకోక‌పోవ‌చ్చు లేదా క‌నీసం మాట్లాడుకోక‌పోవ‌చ్చు, కానీ త‌ను నా ప‌క్క‌న ఉంటే చాలు" అని చెప్పుకొచ్చాడు ర‌ణ‌బీర్‌.

అదే ఇంట‌ర్వ్యూలో ఆలియా కూడా ర‌ణ‌బీర్ చెప్పిన‌దాన్ని అంగీక‌రించింది. తాను లేకుండా అత‌నేమీ చేయ‌లేడ‌నీ, త‌ను లేక‌పోతే చివ‌రి నిమిషం దాకా ప్ర‌తి ప‌నినీ పెండింగ్‌లో పెడ‌తాడ‌నీ తెలిపింది. "ర‌ణ‌బీర్ ఏమీ చెయ్య‌లేడు. నేను అత‌ని ద‌గ్గ‌ర‌లో లేక‌పోతే, లాస్ట్ మినిట్ దాకా ప్ర‌తిదీ అలాగే వ‌దిలేస్తాడు" అందామె.