English | Telugu

'జవాన్' కోసం రంగంలోకి దిగుతున్న అల్లు అర్జున్!

ఒక స్టార్ సినిమాలో మరో స్టార్ గెస్ట్ రోల్ చేయడం తరచూ చూస్తున్నాం. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక ప్రేక్షకులను ఆకర్షించడం కోసం వివిధ భాషలకు చెందిన స్టార్లను చిత్రంలో భాగం చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'జవాన్' చిత్రం విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

'పఠాన్' ఘన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న షారుఖ్ త్వరలో 'జవాన్'తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకుడు. అందుకే ఈ చిత్రంపై నార్త్ తో పాటు సౌత్ లోనూ ఆసక్తి నెలకొంది. షారుఖ్ సినిమాలకు నార్త్ లో భారీ కలెక్షన్లు రావడం సహజం. అయితే సౌత్ లోనూ అదే స్థాయిలో వసూళ్లు రాబట్టేలా సౌత్ స్టార్స్ ని సినిమాలో భాగం చేస్తున్నాడు అట్లీ. కోలీవుడ్ నుంచి నయనతార, విజయ్ సేతుపతి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే దళపతి విజయ్ కూడా గెస్ట్ రోల్ పోషించనున్నాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.

'జవాన్'లో అతిథి పాత్ర కోసం అల్లు అర్జున్ ని సంప్రదించినట్లు న్యూస్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ కూడా ఆ పాత్రలో నటించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ. పుష్పకి ముందే ఆయనకు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి జవాన్ టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సౌత్ లో జవాన్ భారీ కలెక్షన్లు కొల్లగొడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.