English | Telugu

అక్ష‌య్‌కి భార‌త పౌర‌స‌త్వం.. ఇక‌నైనా విమ‌ర్శ‌లు ఆగేనా!

సినీ ల‌వ‌ర్స్‌కి బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ గురించిన ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అయితే ఆయ‌న‌కు భార‌తీయ పౌర‌స‌త్వం లేదు. కెన‌డా సిటిజ‌న్‌షిప్ మాత్ర‌మే ఉంది. 2019లో అక్ష‌య్ భార‌తీయ పౌర‌స‌త్వానికి అప్లికేష‌న్ పెట్టుకున్నారు. నాలుగేళ్ల‌కు ఆయ‌న‌కు మ‌న దేశ పౌర‌సత్వాన్ని ఇచ్చారు. బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒక‌రిగా కొన‌సాగుతోన్న అక్ష‌య్ కుమార్ ఇన్నేళ్లు కెన‌డా పౌర‌స‌త్వంతోనే ఉంటున్నారు. దీనికి సంబంధించి ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అయితే భార‌త ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు స్పందించి పౌర‌స‌త్వం ఇవ్వ‌టంపై అక్ష‌య్‌ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

77వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్బంగా అక్ష‌య్ కుమార్ త‌న‌కు భార‌త ప్ర‌భుత్వం జారీ చేసిన అధికారిక పౌర‌స‌త్వానికి చెందిన ప‌త్రాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ‘నా మనసు, పౌరసత్వం రెండూ హిందుస్థానీ. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జై హింద్‌’ అంటూ తనకు పౌరసత్వం వచ్చిన విషయాన్ని అక్షయ్ తెలియ‌జేశారు. దీంతో ఆయ‌న కొన్నాళ్లుగా పౌర‌స‌త్వం విష‌యంలో ఎదుర్కొంటున్న విమ‌ర్శ‌కుల‌కు చెక్ పెట్టిన‌ట్ల‌య్యిందని నెటిజ‌న్స్ శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు.

సినిమాల విష‌యానికి వ‌స్తే అక్ష‌య్ కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఓమైగాడ్ 2 సినిమా రీసెంట్‌గా విడుదలైంది. పిల్ల‌ల‌కు లైంగిక విద్య ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేసే పాయింట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాపై హిందూ సంఘాలు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశాయి. అయితే సినిమా మాత్రం మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంది.